అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ రోజు సభలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారిగా ప్రసంగించారు. ఈ సందర్భంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడిపై పవన్ చేసిన వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి. ఇకపై ప్రతిపక్ష నేతలను తిట్టే అవకాశం అయ్యన్నకు లేదని, సభలో ఎవరైనా తిడుతుంటే అడ్డుకోవాల్సింది ఆయనే అని చమత్కరించడంతో సభ్యులంతా నవ్వారు. ప్రతిపక్ష నేతలపై వాడీవేడీ విమర్శలు చేసిన అయ్యన్నపాత్రుడిని ఇంతకాలం ప్రజలు చూశారని, ఇకపై స్పీకర్ గా హుందాగా ఉండే అయ్యన్న పాత్రుడిని చూస్తారని చెప్పారు.
వైసీపీ సభ్యులు సభకు రాకపోవడంపై పవన్ అసహనం వ్యక్తం చేశారు. ధైర్యం లేక వారు సభకు రాలేదని పవన్ విమర్శించారు. ఐదేళ్లు వ్యక్తిగత దూషణలకే పరిమితం అయిన వైసీపీ నేతలకు 11 సీట్లు మాత్రమే వచ్చాయని పవన్ అన్నారు. గెలుపును స్వీకరించింత సునాయాసంగా ఓటమిని వారు తీసుకోలేకపోయారని పవన్ ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలోని శాసనసభలో వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత విమర్శలు, బూతులు ఉన్నాయని..కానీ, ఈ సభలో అలాంటివి ఉండవని చెప్పారు. 2047 నాటికి ఏపీ ఉన్నత శిఖరాలకు చేరేందుకు ఇప్పుడే పునాది వేయాలని చెప్పారు. పవన్ తొలి స్పీచ్ లో నే అదరగొట్టారని ప్రశంసలు దక్కుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ ప్రసంగం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.