ఏపీ సీఎం చంద్రబాబు గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీ పడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి, సంక్షేమంలో ముందుకు తీసుకెళ్లే అవకాశం తనకు వచ్చిందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. తాను గతంలో 12 గంటలు పనిచేస్తే చాలనుకునేవాడినని, కానీ, ఇకపై చంద్రబాబులా 18 గంటలు పని చేసి ఆయనతో పోటీ పడతానని చెప్పారు.
ఇదే విషయాన్ని తెలంగాణ అధికారులు, సహచరులతో చెప్పానని అన్నారు. బసవతారకం ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రేవంత్ రెడ్డి మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అన్న నందమూరి బాలకృష్ణ తనను ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారని, మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా తనకు ఇదొక మంచి అవకాశం అని చెప్పారు.
ఎన్టీఆర్ ఆలోచనతో చంద్రబాబు సహకారంతో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని కోట్లాది మందికి సేవలు అందించిన ఈ సంస్థ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం తనకు సంతోషాన్నిచ్చిందని రేవంత్ చెప్పారు. సంకీర్ణ రాజకీయాలకు పునాది వేసింది ఎన్టీఆర్ అని, రూ.2కే కిలో బియ్యం, జనతా వస్త్రాలు వంటి అనేక సంక్షేమ పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారని గుర్తు చేసుకున్నారు. సినీ రంగాన్ని బాలకృష్ణ, ఆయన అల్లుళ్లు లోకేశ్, భరత్ రాజకీయాలు, సంక్షేమం బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణతోపాటు మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు.
ఏపీ సీఎంగా చంద్రబాబు, తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు ఒకదానితో ఒకటి అభివృద్ధిలో పోటీ పడడడం ఖాయంగా కనిపిస్తోంది. చంద్రబాబు పొలిటికల్ స్కూల్ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి…ఆ స్కూల్ ప్రిన్సిపాల్ చంద్రబాబు ల మధ్య ఆరోగ్యకరమైన అభివృద్ధి పోరు తప్పదు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగే ప్రయత్నాలలో భాగంగానే రేవంత్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎంగా గెలిచిన తర్వాత రేవంత్, చంద్రబాబు ఒక్కసారి కూడా భేటీ కాలేదు. త్వరలోనే వీరి భేటీ ఉండనుందని తెలుస్తోంది.