2019 సార్వత్రిక ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేశ్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. 2014-2019 టీడీపీ హయాంలో ఎమ్మెల్సీ కోటాలో ఐటీ శాఖా మంత్రి అయిన లోకేశ్ ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదంటూ వైసీపీ నేతలు విమర్శించేవారు. వాస్తవానికి మంగళగిరిలో టీడీపీ ట్రాక్ రికార్డ్ అంత బాగోలేదు. 2024 ఎన్నికల్లో లోకేశ్ వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నా సరే..ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతుక్కోవాలి అన్న లోకేశ్ అక్కడ నుంచే పోటీ చేశారు.
ఏదో ఆషామాషీ గెలుపు కాకుండా 90 వేల పైచిలుకు మెజారిటీ సాధించి రాష్ట్రంలోనే మూడో అత్యధిక మెజారిటీ గెలుపును సొంతం చేసుకొని వైసీపీ నేతలకు తన సత్తా ఏమిటో చాటిచెప్పారు. ఈ క్రమంలోనే ఈ రోజు తొలిసారి ఎమ్మెల్యేగా ఐటీ శాఖా మంత్రి హోదాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే తన ఎక్స్ ఖాతాలో లోకేశ్ భావోద్వేగంతో కూడిన ఓ పోస్ట్ పెట్టారు. ఈ రోజు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడం తన జీవితంలో మరపురాని ఘట్టం అని లోకేశ్ పెట్టిన ఎమోషనల్ ట్వీట్ వైరల్ అయింది.
“మంగళగిరి నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఇవాళ తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన నేను ఎమ్మెల్యేగా ప్రమాణం చేయడం నా జీవితంలో మరపురాని ఘట్టం. ఐదేళ్ల క్రితం ఓడిపోయిన చోటే రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిన మంగళగిరి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటాను. ప్రజలు నాపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన ఈ అవకాశాన్ని వారి సంక్షేమం, అభివృద్ధి కోసం వినియోగిస్తాను. రాష్ట్రంలో కూటమి నేతృత్వంలో కొలువైన ప్రజా ప్రభుత్వం ఐదు కోట్ల మంది ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకు పనిచేస్తుంది” అని లోకేశ్ ట్వీట్ చేశారు.