ఏపీలో ఈ రోజు 16వ అసెంబ్లీ కొలువుదీరింది. ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ రోజు సభలో ప్రమాణం సందర్భంగా కొన్ని భావోద్వేగ సన్నివేశాలు కనిపించాయి. ఏపీ సీఎం చంద్రబాబు, పులివెందుల ఎమ్మెల్యే జగన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ ల ప్రమాణ స్వీకారం వెనుక ఎమోషనల్ సీన్స్ కనిపించాయి. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
వస్తారో రారో అన్న నాటకీయ పరిణామాల మధ్య అసెంబ్లీకి వచ్చిన జగన్ డీలాగా ప్రమాణం చేశారు. గత అసెంబ్లీలో 151 మంది ‘మంద’ బలంతో బాహుబలి మాదిరి సభలో ప్రమాణ స్వీకారం చే ధీమాగా కనిపించిన జగన్…ఈ సారి అదే సభలో 11 మంది ఎమ్మెల్యేలతో బలహీనుడిగా కనిపించారు. దీన వదనంతో అడుగులు వేస్తూ డీలాగా జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో జగన్ కేవలం పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. సభలో జగన్ 5 నిమిషాల కంటే ఎక్కువ సేపు ఉండలేదు.
అసెంబ్లీ మెయిన్ గేటులో అమరావతి రైతులు, ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమవుతాయేమోనన్న అనుమానంతో జగన్ గతానికి భిన్నంగా వెనుక గేటు నుంచి వచ్చారు. తన ప్రమాణం సమయానికి 5 నిమిషాల ముందు సభలోకి వచ్చిన జగన్ ప్రమాణ స్వీకారం సమయంలో కలిపి మొత్తం 5 నిమిషాల్లో సభ నుంచి వాకౌట్ చేశారు. వాస్తవానికి జగన్ తన పేరు క్రమ ప్రకారం ప్రమాణం చేయాల్సి ఉంది. కానీ, మంత్రులు ప్రమాణం చేసిన తర్వాత జగన్ కు అనుమతివ్వాలని చంద్రబాబును వైసీపీ నేతలు కోరగా దానికి ఆయన అనుమతించారు. తర్వాత జరగబోయే అసెంబ్లీ సమావేశాలను జగన్ బాయ్ కాట్ చేసి ప్రజల మధ్యకు వెళతారన్న టాక్ గట్టిగా వస్తోంది.
గత ఎన్నికల్లో ఓటమి పాలైన నారా లోకేశ్ ఈ సారి ఏకంగా మంత్రి హోదాలో అసెంబ్లీలో ఎమ్మెల్యేగా తొలిసారి ప్రమాణం చేశారు. ఓ పక్క లోకేశ్ రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తుండగా…జగన్ మాత్రం రెట్టించిన నిరుత్సాహంతో బేలగా కనిపించారు.
ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వం అంటూ బీరాలు పోయిన మాజీ మంత్రి కొడాలి నానికి షాకిచ్చేలా పవన్ ఏకంగా డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.