తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో పోచారం కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. కేసీఆర్ రైట్ హ్యాండ్ గా పేరున్న పోచారం పార్టీని వీడడంతో బీఆర్ఎస్ కు షాక్ తగిలినట్లయింది.
బీఅర్ఎస్ అధినేత కేసీఆర్ తొలి విడతలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి కీలకమైన వ్యవసాయ శాఖా మంత్రిగా, మలివిడతలో శాసనసభ స్పీకర్ గా అవకాశం ఇచ్చారు. ఇక ప్రతి సభ, సమావేశంలో పోచారంకు విపరీతమైన గౌరవం ఇచ్చేవారు. ప్రత్యేకంగా ఆయనను లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టి ప్రముఖంగా ప్రస్తావించేవారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆయనతో రేవంత్ రెడ్డి భేటీకావడం కలకలం రేపుతున్నది.
పోచారం కుమారుడు భాస్కర్ రెడ్డి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ గా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవిశ్వాసం పెట్టడంతో పదవికి రాజీనామా చేశాడు. ప్రస్తుతం పార్టీ మారే విషయంలో ఆయన కుమారుడే వత్తిడి తెస్తున్నట్లు తెలుస్తుంది. పోచారంతో రేవంత్ భేటీ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఆయనను కలవాలని నిర్ణయించినట్లుగా సమాచారం. మరి పోచారం ఏం చెబుతాడు ? వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుంది ? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇటీవలి ఎన్నికల్లో పోచారం కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై 23464 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ హయాంలో పంచాయతీరాజ్, గృహనిర్మాణం, గనుల శాఖ మంత్రిగా పనిచేసాడు. కాంగ్రెసు పార్టీలో ఉన్న పోచారం, 1984లో తెలుగు దేశం పార్టీలో చేరాడు.1994లో బాన్సువాడ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీనాదేవిపై 57 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కిషన్ సింగ్ పై 31 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఆయన 2004లో కాంగ్రెస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో ఓడిపోయాడు. 2009లో బాజిరెడ్డి గోవర్ధన్ పై 26వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2014, 2019, 2023లలో వరసగా గెలుపొందడం విశేషం.