కులం చూడం..మతం చూడం…ప్రాంతం చూడం.. ఏపీ మాజీ సీఎం జగన్ తో సభలు, సమావేశాల్లో పదే పదే చెప్పే డైలాగ్ ఇది. అయితే, ఈ డైలాగ్ జగన్ కు అనసొంపుగా…వైసీపీ నేతలు, కార్యకర్తలకు వినసొంపుగా ఉంటుందేమోగానీ వాస్తవాలు మాత్రం ఆ డైలాగ్ కు భిన్నంగా ఉన్నాయన్న సంగతి తెలిసిందే. పైకి మాత్రం నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెబుతూ…పదవుల పందేరంలో మాత్రం తన రెడ్డి సామాజిక వర్గానికే జగన్ పే….ద్ద పీట వేసిన వైనంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. పైగా,
అబద్దపు ప్రచారాలు, జాబితాలతో చంద్రబాబు పై కుల ముద్ర నిందలు వేయడం వైసీపీ నేతలకే చెల్లింది.
జగన్ పాలనలో ఏపీలోని కీలక స్థానాల్లోని అధికారులంతా జగన్ సామాజిక వర్గానికి చెందిన వారే.ఆంధ్రప్రదేశ్ లో అత్యంత కీలకమైన మూడు పదవులు రెడ్లకే జగన్ కట్టబెట్టారన్నది బహిరంగ రహస్యమే. ఆనాడు డీజీపీగా రాజేందర్ నాథ్ రెడ్డి, ఏపీ సీఎస్‌గా జవహర్ రెడ్డి, టీటీడీ ఈఓగా ధర్మారెడ్డి నియమించారు జగన్. బీసీలు బ్యాక్ బోన్ ని చెప్పే జగన్…కీలక పదవులు మాత్రం తన అనుకునే తన రెడ్డి సోదరులకే కట్టబెట్టడం విమర్శలకు తావిచ్చింది.
కానీ, వాస్తవానికి బీసీలకు ఆది నుంచి అండగా నిలిచింది టీడీపీ అని బీసీలకు తెలుసు. చంద్రబాబు సీఎం అయితే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీలంతా ఆయనవైపు నిలబడ్డారు. అందుకు తగ్గట్లుగానే నేడు ఏపీలోని మూడు కీలక పదవులను చంద్రబాబు బీసీలకు కట్టబెట్టి బీసీలు టీడీపీ డీఎన్ఏలో ఉన్నారని మరోసారి నిరూపించారు. ఏపీలోని మూడు టాప్ పోస్టులను బీసీలకు ఇచ్చి వారిపట్ల టీడీపీ నిబద్ధతను చాటి చెప్పారు.
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావు, ఏపీ సీఎస్‌గా నీరబ్ కుమార్ (యూపీలో బీసీ)ప్రసాద్, టీటీడీ ఈఓగా శ్యామలరావు..ముగ్గురు బీసీలను నియమించారు చంద్రబాబు. ఈ క్రమంలోన బీసీలకు చంద్రబాబు ఇచ్చిన ప్రాధాన్యతపై ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది. బీసీలకు చంద్రబాబు ఇచ్చే టాప్ విలువ ఇది అంటూ నెటిజన్లు చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.