‘‘ అసెంబ్లీ లో మన బలం తక్కువ… అది కౌరవ సామ్రాజ్యం…కాబట్టి అసెంబ్లీలో మనం చేయగలిగింది కూడా పెద్దగా ఏమీ ఉండదు. అందుకే మనం ప్రజలకు చేరువ అవుదాం. నాకు వయసుతో పాటు సత్తువ కూడా ఉంది. ప్రజలకు దగ్గరయ్యేందుకు నేను మరింతగా పోరాడగలను. ప్రజాపోరాటాల్లో వైసీపీకి, ఈ జగన్ కు ఎవరూ సాటిరారు.’’ ఈ రోజు జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ నేతలకు మాజీ సీఎం జగన్ చెప్పిన మాటలివి.
ఈ మాటలను బట్టి జగన్ కు అసెంబ్లీకి వెళ్లే ఉద్దేశ్యం లేదు. అయితే..గియితే..ప్రమాణ స్వీకారం చేసి అక్కడ నుంచి వెళ్లిపోదామన్న మోడ్ లో జగన్ ఉన్నట్లు కనిపిస్తోంది. మొన్నటిదాకా 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలతో ఆహా..ఓహో..అనిపించుకున్న జగన్…ఇపుడు 164 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేల ముందు కూర్చునే సాహసం చేయబోరని ఆ మాటలను బట్టి అర్థమవుతోంది. గతంలో జగన్ అసెంబ్లీలో చేసిన కామెంట్లకు ఈ సారి టీడీపీ ఎమ్మెల్యేల నుంచి కౌంటర్లు పడడం ఖాయం. 151 నుంచి 11కు పడిపోయి..ప్రతిపక్ష హోదా కోల్పోయి అవమానభారంతో కుంగిపోతున్న జగన్…ఈ కౌంటర్లను తట్టుకోలేమని ఫిక్సయినట్లు కనిపిస్తోంది.
ఇక, అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదా మిస్సయినందున చిట్టి చివర లైన్లో సీట్లు కేటాయించే అవకాశముందని తెలుస్తోంది. అందుకే, తాను అసెంబ్లీకి రానని, ప్రజల మధ్యలోకి వెళ్లి వారికి మరింత చేరువ అవుతానని తన పార్టీ నేతలతో చెప్పారు. అయితే, గెలిచిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలా వద్దా అన్నది వారి ఇష్టమని, తాను వెళ్లమని..వద్దని ఏదీ చెప్పనని జగన్ అన్నారని తెలుస్తోంది. మరి, రేపు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జగన్ అండ్ కో అసెంబ్లీలో అడుగుపెడతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.