మైండ్ లోఉండాల్సిన చిప్ ఎక్కడో పోతే.. ఎలా అయితే వ్యవహరిస్తారో.. ఇంచుమించు చాలామంది ఇలానే వ్యవహరిస్తున్నారు. ఓవైపు కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోవటం.. మరోవైపు వ్యాక్సిన్ చేయించుకోవాలని అనుకున్నా.. కొరత కారణంగా వేయించుకోలేకపోతున్నారు. వాస్తవంలో పరిస్థితి దారుణంగా.. ఇబ్బందికరంగా ఉంది. అన్నింటికి మించిన పాజిటివ్ గా తేలిన వారి పరిస్థితి ఆందోళనకు గురి చేస్తోంది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు.
ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే.. ఈ ప్రత్యేక పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు బెట్టింగ్ మహారాజులు. తాజాగా కరోనా మీదా బెట్టింగ్ మొదలైంది. ఏంది? అని షాక్ తినాల్సిన అవసరం లేదు. అగ్గిపిల్ల.. కుక్కపిల్ల.. సబ్బు బిల్ల కాదేదీ కవితకు కనర్హమన్నట్లుగా.. బెట్టింగుల్లో మునిగి తేలే వారికి.. కరోనా కేసులు.. లాక్ డౌన్ ఎప్పుడు విధించే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ఒక కొత్త ట్రెండ్ ను గుర్తించారు.
అదేమంటే.. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో.. రోజుకు ఎన్ని కేసులు పెరుగతాయి? రోజు వారీగా నమోదు చేసే గణాంకాల వివరాలతో పాటు.. దేశ వ్యాప్తంగా లాక్ డన్ విధిస్తారా? లేదా? అన్న ప్రశ్న మీద కూడా విపరీతమైన బెట్టింగులు సాగుతున్నట్లుగా గుర్తించారు. సోషల్ మీడియా.. వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్ సాగుతోంది. ఓవైపు అత్యవసర వైద్య సదుపాయం లేక.. ప్రాణాలు పోతుంటే.. మరోవైపు తమ బెట్టింగ్ కు ఇదో సాధనంగా వాడుకునే తీరు చూస్తే.. బెట్టింగు బాసుల మనసులు మరీ ఇంత కఠినంగా ఉంటాయా? అనిపించక మానదు.