ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ .. ఇంకా తన పాలనకు తనే సెల్ఫ్ సర్టిఫికెట్లు మంజూరు చేసుకుం టున్నారు. విలువలు, విశ్వసనీయతతో తాను పాలించానని చెప్పుకొంటున్నారు. కులం, మతం , ప్రాంతం , పార్టీలను కూడా చూడకుండానే అందరికీ సంక్షేమం ఇచ్చానని చెప్పుకొంటున్నారు. తన పాలన అద్భుతమని కూడా వాదన వినిపిస్తున్నాయి. అంతేకాదు.. ఇప్పటికీ జగన్ తన పాలనలో జరిగిన తప్పులు ఏంటి? అనే సమీక్ష కూడా చేయకపోవడం గమనార్హం. మరి ఉద్దేశ పూర్వకంగానే వీటిని వదిలేస్తున్నారా? లేక నిజంగానే తప్పులు కనిపించడం లేదా?
ఈ ప్రశ్నలకు సమాధానం ఎలా ఉన్నప్పటికీ.. గత రెండేళ్లుగా కొందరు వైసీపీ నాయకులు సైతం.. తప్పు లు జరుగుతున్నాయని చెబుతూనే ఉన్నారు. ముఖ్యంగా అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న ఆనం రామ నారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, శ్రీధర్‌రెడ్డి వంటివారు.. తప్పుల చిట్టాలను బహిర్గత పరిచారు కూడా.. అయినా.. జగన్ చలించలేదు. ఇక, ఎన్నికల అనంతరం.. మరింత మంది ఈ విషయంపై స్పందించారు. సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే గా పేరొంది.. తాజా ఎన్నికల్లో ఓడిపోయిన కాటసాని రాంభూపాల్ రెడ్డి వంటి వారు కూడా.. తప్పులు ఎత్తి చూపించారు.
1) అందరికీ సెంటిమెంటుగా మారిన అమరావతి రాజధాని జోలికి వెళ్లి.. దానిని గాలికి వదిలేయడం.
2) అందరూ నవ్వుకునేలా మూడు రాజధానులను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం. దేశంలో ఎక్కడా ఇలాంటి విధానం లేదు.
3) వలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి.. పార్టీ కార్యకర్తలకు వాల్యూ లేకుండా చేయడం.
4) ప్రజాప్రతినిధులకు కనీసం ముఖ్యమంత్రిగా అప్పాయింట్‌మెంటు కూడా ఇవ్వకపోవడం.
5) చంద్రబాబును అరెస్టు చేయించి.. సానుభూతిని పెంచేలా వ్యవహరించడం.
6) మహిళలను దూషించిన వారిని, బట్టలిప్పి చూపించిన ఎంపీని, శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని వెనుకేసుకుని రావడం.
7) టీడీపీ నేతలపైనా.. కార్యకర్తలపై పోలీసులను ప్రయోగించడం.
8) ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీపై నోరు ఎత్తకపోవడం. దీనిని నెరవేర్చాలన్నవారిపై నిర్బంధాలు కొనసాగించడం.
9) మెగా డీఎస్సీ కోసం నిరుద్యోగులు ఉద్యమించినప్పుడు కూడా.. కేసులు పెట్టడం.
10) ఐదేళ్లలో కనీసం ఒక్కసారి కూడా.. మీడియా ముందుకు వచ్చి.. ఏం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడం. పోనీ క్షేత్రస్థాయిలో ఏంజరుగుతోందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం.
11) ల్యాండ్ టైటిలింగ్ యాక్టను ఇప్పుడు తీసుకురావద్దని అవగాహన ఉన్న 42 మంది ఎమ్మెల్యేలు నెత్తీ నోరూ మొత్తుకున్నా.. కనీసం వారి మాట వినిపించుకోకపోవడం.
– ఇవన్నీ కళ్ల ముందు కనిపిస్తున్న తప్పులు. కనిపించని ఇంతకు నాలుగింతలు ఉన్నాయి. అయినా.. ఎక్కడా ఎప్పుడూ సమీక్షించింది లేదు. కనీసం ఇప్పుడైనా సమీక్షించుకుంటారా? అంటే అది కూడా.. ప్రశ్నార్థకంగానే మారిపోయింది. ఇదీ.. జగన్ మారలేదు.. అనిచెప్పడానికి ప్రబల నిదర్శనం.