ఎన్డీఏ కూటమి శాసన సభాపక్ష నేతగా, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబును కూటమి నేతలు ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తప్పు చేసిన వైసీపీ నేతలు, పోలీసులు, అధికారులకు చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు.
“తప్పు చేసినవాడిని క్షమించి, పూర్తిగా వదిలిపెడితే అది అలవాటుగా మారుతుంది. తప్పు చేసినవాళ్లకు చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో విధ్వంస, కక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలి. పదవి వచ్చిందని విర్రవీగొద్దు. వినయంగా ఉండాలి” అని చంద్రబాబు అన్నారు. తానెప్పుడూ రాగద్వేషాలకు అతీతంగా పనిచేశానని, తనకు ప్రజాహితమే తెలుసని అన్నారు.
ఐదేళ్లుగా రాష్ట్రం పూర్తిగా శిథిలమైందని, సమస్యల సుడిగుండంలో చిక్కుకుందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు దెబ్బతిన్నాయని, రైతులు అప్పుల పాలయ్యారని చెప్పారు. సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను చక్కదిద్దే పని ప్రారంభిస్తామని వివరించారు. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకు వెళతామని చెప్పారు.
‘సీఎం పదవి హోదా కోసమే తప్ప పెత్తనం కోసం కాదు. సీఎం కూడా మామూలు మనిషే.. అలాగే మీ ముందుకు వస్తా. మిత్రుడు పవన్ కల్యాణ్ తో పాటు మేమంతా సామాన్యులుగానే ప్రజల వద్దకు వస్తాం’ అని చెప్పారు.