కొద్ది నెలల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి జైలులో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్నారు. ఆ క్రమంలోనే చంద్రబాబును కలిసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లారు. చంద్రబాబుతో ములాఖత్ అయిన వెంటనే జైలు నుంచి బయటకు వచ్చిన పవన్ కల్యాణ్ సంచలన ప్రకటన చేశారు. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందదని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జగన్ ను గద్దె దించేందుకే పొత్తు పెట్టుకుంటున్నామని పవన్ చెప్పారు. అంతేకాదు, ఆ తర్వాత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్ సతీమణి బ్రాహ్మణితో పవన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. చంద్రబాబు అరెస్టు అయ్యారన్న బాధతో కన్నీరు పెట్టుకున్న భువనేశ్వరిని పవన్ ఓదార్చారు. కన్నీరు పెట్టొద్దని, కాలం ఇలాగే ఉండదని, త్వరలోనే మంచిరోజులు వస్తాయని భరోసాని, కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. ఏదో పవన్ మాట వరసకు చెప్పారు అని అంతా అనుకున్నారు.
కట్ చేస్తే, పవన్ చెప్పిందే చేశారు. నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికే కాదు ఏపీకి మంచి రోజులు తెచ్చేందుకు టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి ఏర్పాటుకు మధ్యవర్తిగా ఉండి అలుపెరుగని పోరాటం చేశారు. ఆనాడు భువనేశ్వరికి చెప్పినట్లుగా జగన్ ను గద్దె దించి మంచి రోజులు తెచ్చారు. ఈ క్రమంలోనే ఈ రోజు ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా, ఎన్డీఏ కూటమి తరఫున ఏపీకి కాబోయే ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు పేరును జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రతిపాదించగా…అందుకు టీడీపీ, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ లు పరస్పరం ఆలింగనం చేసుకొని ఎమోషనల్ అయ్యారు. చంద్రబాబు చేతిలో చేయి వేసిన పవన్ భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత కూర్చునేంందుకు వెళుతున్న చంద్రబాబు చేయిపట్టుకొని మరీ పవన్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.
చంద్రబాబును పక్కనపెట్టుకొనే తాను ఈ మాట చెప్పాలని పవన్ అన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నపుడు చాలా నలిగిపోయారని, అది తాను చూశానని పవన్ భావోద్వేగానికి గురయ్యారు. ఆనాడు భువనేశ్వరి గారి బాధను చూశాను, అమ్మా మీరు కన్నీళ్లు పెట్టకండి, మంచి రోజులు వస్తాయి అని ఆ రోజు జైల్లో చెప్పానని, అన్నట్లే మంచి రోజులు వచ్చాయని పవన్ ఎమోషన్ అయ్యారు. మనస్ఫూర్తిగా చంద్రబాబు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి సుపరిపాలన కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారని, ఆ సుపరిపాలనను చంద్రబాబు అందజేయాలని అన్నారు. కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు ఇది సమయం కాదని అన్నారు. తన గురించి పవన్ చెబుతుంటే చంద్రబాబు కళ్లు కూడా భావోద్వేగంతో చెమర్చాయి. పవన్ కు థ్యాంక్స్ చెబుతున్నట్లుగా చంద్రబాబు తల ఊపి వెళ్లి తన సీట్లో కూర్చున్నారు.
పవన్, చంద్రబాబులు హగ్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరిద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఈ రేంజ్ లో ఉందా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చంద్రబాబు అంటే పవన్ కు ఎంత గౌరవం, అభిమానం ఉన్నాయో మాటల్లో చాలా సార్లు కనిపించిందని, అది చేతల్లో కూడా ఈ రోజు చూశామని అంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు, పవన్ ల ఎమోషనల్ బాండింగ్ వీడియో సోషల్ మీడియాలో నెంబర్ వన్ గా ట్రెండ్ అయ్యి వైరల్ గా మారింది.