ఐదేళ్ల తర్వాత మరోసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ఆయనలో ప్రత్యేక కోణం కనిపిస్తున్నది. నాలుగు రోజుల క్రితం పార్టీ ఎంపీని ఢిల్లీ టికెట్ తీసుకున్నావా ? మన వాళ్లతో తీయించని ? అంటూ ఆప్యాయంగా పలకరించిన విషయం తెలిసిందే.
తాజాగా ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష నేత ఎంపిక కోసం మంగళవారం విజయవాడలో జరిగిన సమావేశంలో మరో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సమావేశం కోసం ఏర్పాటు చేసిన వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్, పురందేశ్వరి, అచ్చెన్నాయుడులకు కుర్చీలు వేశారు.
ఇందులో చంద్రబాబు కోసం ప్రత్యేకమైన కుర్చీ, మిగతా వారికి సాధారణ కుర్చీలను ఏర్పాటు చేశారు. వేదికపైకి వస్తుండగా కుర్చీలలో తేడాను గుర్తించిన చంద్రబాబు వెంటనే తన సిబ్బందిని పిలిచి మిగతా కుర్చీలకు తన కుర్చీకి తేడాను చూపిస్తూ.. అలాంటి తేడాలు ఏవీ చూపించొద్దని, ఇక్కడ అందరూ ఒకటేనని సాధారణ కుర్చీ తెప్పించుకుని కూర్చున్నారు.
దీనికి సంబంధించిన వీడియోను తెలుగుదేశం పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ ‘ఇది చంద్రబాబు గారి సంస్కారం. కూటమి నేతలు పవన్ కల్యాణ్ గారు, పురందేశ్వరి గారికి గౌరవం ఇస్తూ, తనకు వేసిన ప్రత్యేకమైన కుర్చీని వద్దని, వాళ్లు కూర్చున్న కుర్చీ లాంటిదే తెమ్మని చెప్పిన చంద్రబాబు గారు’ అని పేర్కొంది.