సరిగ్గా ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరిన మాజీ ఎంపీ కేశినేని నాని ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. తన సోదరుడు, టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని చేతిలో కేశినేని నాని భారీ తేడాతో ఓడిపోయారు. ఇక, ఆయన చేరిన వైసీపీ రాజకీయ భవిష్యత్తు ఏపీలో అగమ్యగోచరంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా కేశినేని నాని సంచలన నిర్ణయం తీసుకున్నారు. యాక్టివ్ పాలిటిక్స్ నుంచి వైదొలుగుతున్నట్లు కేశినేని నాని సంచలన ప్రకటన చేశారు. తర రాజకీయ ప్రస్థానానికి ఈ రోజుతో ముగింపు పలుకుతున్నానని అన్నారు. అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నానని చెప్పారు.
విజయవాడ ఎంపీగా రెండుసార్లు ప్రజలు తనను గెలిపించారని, వారికి సేవ చేయడం తనకు దక్కిన గొప్ప గౌరవం అని అన్నారు. అయితే, రాజకీయాల నుంచి తప్పుకున్నా…విజయవాడ అభివృద్ధికి తన వంతు సాయం చేస్తూనే ఉంటానని చెప్పారు. తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కాబోతోందని అన్నారు. ఈ క్రమంలోనే కేశినేని నాని ప్రకటనపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న సెటైర్లు వేశారు.
‘‘అయ్యా కేశినేని నానీ… నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవడం కాదు… ప్రజలే నిన్ను తప్పించారు అంటూ సెటైర్ వేశారు. రాష్ట్రమంతా వైసీపీ ఓడిపోవడం ఒకెత్తయితే, విజయవాడ ప్రజలు నిన్ను ఒక్కడ్నీ ఓడించడం మరో ఎత్తు. రెండు సార్లు నిన్ను పార్లమెంటుకు పంపిన చంద్రబాబును పార్టీలోనే ఉంటూ ఇబ్బంది పెట్టినందుకు ప్రజలే నీకు బుద్ధి చెప్పారు. రెండుసార్లు పార్లమెంటుకు పంపిన చంద్రబాబుకు కనీసం కృతజ్ఞతలైనా చెబుతావని ఆశిస్తున్నాం. అలాగే, రెండోసారి నువ్వు గెలిచినప్పటి నుంచి నీ మాటలతో ఆయనను బాధపెట్టినందుకు క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నాం” అని బుద్ధా వెంకన్న చురకలంటించారు.