ఈ రోజు ఏపీలో కనిపిస్తున్న రాజకీయ వాతావరణానికి కర్త..కర్మ.. క్రియ అన్నీ పవన్ కల్యాణే. ఈ మాట తెలుగుదేశంలోని కొంతమందికి రుచించకపోవచ్చు. కానీ.. చాలామంది తెలుగుతమ్ముళ్లు సైతం ఈ వాదనను ఇప్పుడు అంగీకరిస్తున్నారు. గతంలో పవన్ అవసరం తమకు లేదని తెగేసి చెప్పేవారు. కానీ.. వారు సైతం పవన్ విజన్ ను అర్థం చేసుకుంటున్నారు. ఏపీలో జగన్ కు ఓటమిపాలు చేయాలంటే కూటమి అవసరమని చెప్పటమే కాదు.. అటు చంద్రబాబును ఇటు మోడీషాలను ఒప్పించటంలో కీలకభూమిక పోషించారు. దీని కోసం ఆయన చాలానే శ్రమించారు. చివరకు అనుకున్నది సాధించారు.
ఫైటర్ గా మాత్రమే కాదు ప్లానర్ గానూ పవన్ తనకున్న సత్తాను చాటారు. గతానికి భిన్నంగా పవన్ ను ఇప్పుడు తెలుగు ప్రజలు చూస్తున్న తీరు తెన్నుల్లో చాలానే మార్పు వచ్చింది. దీనికి నిదర్శనమన్నట్లు ఎన్నికల ఫలితాలు సైతం అదే విషయాన్ని చెప్పాయి. తాము పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను గెలిపించుకోవటం మామూలు విషయం కాదు. ఈ అరుదైన ఫీట్ ను సాధించారు పవన్ కల్యాణ్. ఇంత చేసిన ఆయన.. తన మనసులో ఏముంది? తాను కోరుకుంటున్న పదవి ఏమిటి? అన్న దానిపై ఎక్కడా.. ఎప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు.
అలాంటిది తాజాగా ఒక జాతీయ (ఇంగ్లిష్) చానల్ కు ఇచ్చిన బైట్ లో క్లారిటీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. మోడీ 3.0 ప్రమాణస్వీకారానికి భార్యతో సహా ఢిల్లీ వెళ్లిన పవన్.. ప్రమాణస్వీకార మహోత్సవాన్ని చాలా జాగ్రత్తగా వీక్షించారు. ఈ సందర్భంగా ఇండియా టుడే చానల్ ప్రతినిధి పవన్ తో మాట్లాడారు. సదరు రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు పవన్ సమాధానాలు ఇచ్చారు. అయితే.. ఆ మాటలు అస్పష్టంగా ఉన్నాయి.
దీంతో పవన్ ఏం మాట్లాడింది సరిగా వినిపించలేదు. అయితే.. పవన్ ను ప్రశ్నలు అడిగిన అనంతరం సదరు రిపోర్టర్.. పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంలో చేరేందుకు రెఢీగా ఉన్నారని పేర్కొన్నారు. కాసేపటికే సదరు టీవీ చానల్ లో డిప్యూటీ సీఎం పదవికి తాను ఆసక్తి చూపుతున్నట్లు పవన్ తమతో చెప్పారంటూ సదరు చానల్ స్క్రోలింగ్ ప్రసారం చేయటం ఆసక్తికరంగా మారింది. డిఫ్యూటీ సీఎం పదవిని తాను ఆశించినట్లుగా ఒక ప్రైవేటు చానల్ కు పవన్ చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆయన కోరుకున్నది బాబు ఎందుకు ఇవ్వరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. పవన్ మైండ్ సెట్ తెలిసిన వారంతా మాత్రం సదరుచానల్ స్క్రోలింగ్ పై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.