ఎన్నికల ఫలితాలు వచ్చాయో లేదో టీడీపీ నేతలు వైసీపీ వాళ్లపై దాడులకు పాల్పడుతున్నారని.. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని మాజీ సీఎం జగన్ గగ్గోలు పెడుతున్నారు. అధికారం దక్కిందని టీడీపీ మూకలు రౌడీయిజం చేస్తున్నాయని ఆరోపించారు. కానీ ఇది రౌడీయిజమా జగన్.. అసలేం చేయకముందే దాడులు చేస్తున్నారని ఆరోపిస్తున్నావ్ మరీ గత అయిదేళ్లలో నువ్వు, మీ నాయకులు కలిసి చేసిందేమిటీ అని జనాలు ప్రశ్నిస్తున్నారు. అయిదేళ్ల పాలనలో గుండాగిరీతో, రౌడీయిజంతో అరాచకం సృష్టించిన జగన్ ఇప్పుడు చిలుక పలుకులు పలకడం విడ్డూరంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు.
అధికారంలో ఉన్నామని దొరికిందల్లా దోచేసి, అడ్డం వచ్చిన వాళ్లను బాదేసిన జగన్‌కు ఇప్పుడు టీడీపీ వాళ్లు దాడులు చేస్తున్నారని కనిపిస్తుందా? అని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో దారుణమైన అవమానాన్ని తట్టుకోలేక అప్పుడే టీడీపీపై జగన్ ఏడుపు మొదలెట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అధికారంలో రావడమే ఆలస్యం ప్రజావేదికను కూల్చడం దగ్గర నుంచి మొన్నటి పోలింగ్ రోజున విధ్వంసం వరకూ జగన్ అండ్ కో చేయని అరాచకం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి జగన్ ఇప్పుడు టీడీపీ నేతలు ఓపికతో ఉన్నా కానీ రెచ్చగొట్టేలా ఆరోపణలు చేయడం సిగ్గుచేటనే విమర్శలు వస్తున్నాయి.
టీడీపీ దాడులపై గవర్నర్ జోక్యం చేసుకోవాలంటూ జగన్ ఎక్స్‌లో పోస్టు కూడా పెట్టారు. టీడీపీ దాడులతో రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొందని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని జగన్ పేర్కొన్నారు. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయిందన్నారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. జగన్ పెట్టిన ఈ పోస్టు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందనే టాక్ వినిపిస్తోంది. అయిదేళ్ల పాలనలో జగన్ చేయని అరాచకం లేదు. పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని దాడులు, శవాలను డోర్ డెలివరీ చేయడం.. ఇలా ఎన్నో ఘాతుకాలకు పాల్పడ్డారనే ఆగ్రహంతోనే జనాలు ఓటుతో చావు దెబ్బ కొట్టారనే టాక్ ఉంది.