ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ఐదేళ్లుగా కొనసాగుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరు బలంగా వినిపించినా, ఆయనను అరెస్టు చేసేదాకా సీఐడీ అధికారులు వెళ్లినా కేసు ముందుకు సాగలేదు. అవినాష్ రెడ్డి బెయిల్ పై ఉండి, ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి కడప ఎంపీగా గెలిచారు. ఈ క్రమంలోనే ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో వివేకా కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా వివేకా కేసుపై
టీడీపీ సీనియర్ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
వివేకా హత్య వెనుక ఓ జంట ఉందని, మరింత లోతుగా దర్యాప్తు జరిగితే ఆ విషయం బయటకు వస్తుందని షాకింగ్ కామెంట్లు చేశారు. వివేకా కేసు మిస్టరీని సీబీఐ 90 శాతం ఛేదించిందని, మిగిలిన 10 శాతం విచారణ పూర్తి చేయించి అసలు హంతకులను జైలుకు పంపుతామని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు మొదలుకాగానే వివేకా హత్య కేసు, కోడికత్తి కేసు విషయాలను సభలో ప్రస్తావిస్తానని తెలిపారు. ఐదేళ్లుగా ఏపీలో భారతీ రెడ్డి రాజ్యాంగం నడిచిందని, జనానికి 25 శాతం డబ్బులు పంచిన జగన్, మిగతా 75 శాతం తన ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు.