ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ 135 అసెంబ్లీ స్థానాలు, 16 ఎంపీ స్థానాలు కైవసం చేసుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మంగళగిరి నుంచి పోటీ చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ 91,500 రికార్డు మెజారిటీతో గెలుపొందారు. ఈ క్రమంలోనే గెలుపొందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో నేడు మంగళగిరిలో లోకేశ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అహంకారం తలకెక్కినట్టు ప్రవర్తించడంతో వైసీపీ 151 సీట్లు కాస్తా 11 అయ్యాయని లోకేశ్ ఎద్దేవా చేశారు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని పోరాడారని విజేతలను అభినందించారు. ప్రజల కోసమే పనిచేయాలని కర్తవ్య బోధ చేశారు. గొప్ప బాధ్యతను ప్రజలు కూటమికి అప్పగించారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తదుపరి లక్ష్యం కావాలని ఆకాంక్షించారు. తనపై చాలా పెద్ద బాధ్యతలే ఉన్నాయని, మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి ,యువగళం పాదయాత్రలో గుర్తించిన సమస్యల పరిష్కారం మరోవైపు ఉన్నాయని అన్నారు. కొత్త ప్రభుత్వంలో తన పాత్రను చంద్రబాబు నిర్ణయిస్తారని లోకేశ్ చెప్పారు.