పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని కాపు ఉద్యమ నేత, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కొద్ది రోజుల క్రితం మంగమ్మ శపథం చేసిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే పిఠాపురంలో పవన్ 70 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ముద్రగడ పద్మనాభం సంచలన ప్రకటన చేశారు. తాను అన్న మాట..చేసిన ఛాలెంజ్ ప్రకారం తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. అంతేకాదు, పేరు మార్పునకు సంబంధించి గెజిట్ పబ్లికేషన్ కోసం అంతా రెడీ చేసుకున్నానని అన్నారు.
మరో రెండు, మూడు రోజుల్లో పేరు మార్పు కోసం దరఖాస్తు చేయబోతున్నానని తెలిపారు. తన పేరు మారిన తర్వాత మళ్లీ ఆ వివరాలు మీడియాకు వెల్లడిస్తానని ముద్రగడ అన్నారు. మరోవైపు, ఎన్నికల ఫలితాలపై కూడా ముద్రగడ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోట్లాది రూపాయలతో ప్రజలకు సంక్షేమాన్ని అందించిన సీఎం జగన్ వంటి నేత దేశంలో మరెవరూ లేరని, ఇలాంటి సాహసం ఎవరూ చేయలేదని అన్నారు. అయినా సరే ప్రజలు ఎందుకు ఓట్లు వేయలేదో అర్థం కావడం లేదన్నారు. సంక్షేమానికి ప్రజలు ఓటు వేయకపోతే.. రాబోయే రోజుల్లో మరే ముఖ్యమంత్రి అటువైపు చూసే అవకాశం ఉండదని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలుపొందిన నాయకులకు ముద్రగడ శుభాకాంక్షలు తెలిపారు.