రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ పై వైసీపీ నాయకురాలు… మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరికి కావాల్సిన స్టోరీలు వాళ్లు వండి వారుస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఎవరు ఎన్ని కథలు అల్లినా..ఎగ్జిట్ పోల్స్ పై ఎన్ని చర్చలు పెట్టుకున్నా చివరకు గెలిచేది వైసీపీనేని రోజా చెప్పారు. మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. ఇక, తన పై వచ్చిన ఎగ్జిట్ పోల్స్ విషయంలోనూ రోజా ఆసక్తిగా రియాక్ట్ అయ్యారు.
నేనా.. ఓడిపోతానా.. ఎవరు చెప్పారు? అంటూ.. ఆశ్చర్యంగా రోజా ప్రశ్నించారు. నగరి నియోజకవర్గం నుం చి పోటీలో ఉన్న రోజా.. ఇప్పటికి వరుసగా రెండు సార్లు విజయం దక్కించుకున్నారు. అయితే.. మూడో సారి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఆమె ఓటమి ఖాయమని పలు సర్వేలు చెప్పాయి. కానీ, ఆమె మాత్రంవాటిని కూడా కొట్టి పారేశారు. నగరి ప్రజలకు తాను చేసిన సేవలు ఎవరూ మరిచిపోరని వ్యాఖ్యానించారు. కొంతమంది తనకు వ్యతిరేకంగా.. ప్రచారం చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు.
ఇక, ఏపీలో ఎగ్జిట్ పోల్స్‌పై ఎవరికి కావాల్సిన కథలు వాళ్లు అల్లుకుని.. వాటినే నకిలీ సర్వేల పేరుతో ప్రచారం చేస్తున్నారని రోజా వ్యాఖ్యానించారు. వైసీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. మహిళలు, వృద్ధులు వైసీపీతోనే ఉన్నారని చెప్పారు. అందుకే.. మహిళా ఓటు బ్యాంకు భారీగా పెరిగిందని తెలిపారు. సంక్షేమానికి, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధిని పెద్ద ఎత్తున అమలు చేసింది ముఖ్యమంత్రి జగనేనని రోజా కితాబిచ్చారు.
దీంతో, సోషల్ మీడియాలో రోజాపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఎగ్జిట్ పోల్స్ లో ఎవరి స్టోరీలు వారు వండి వారుస్తున్నారని రోజా చెప్పారని, ఆ లెక్కన వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వెల్లడించిన ఆరా మస్తాన్ సర్వే స్టోరీ ఎక్కడ వండారు రోజా? అని ప్రశ్నిస్తున్నారు.