మరో మూడు రోజుల్లో ఏపీలో కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కౌంటింగ్ నాడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టిడిపి నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు. కౌంటింగ్ కంటే ముందే తమ నియోజకవర్గాలకు చేరుకోవాలని టీడీపీ అభ్యర్థులు, నేతలకు చంద్రబాబు చెప్పారు.
కౌంటింగ్ సమయంలో ఫలితాలపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు కూటమి గెలుపు ఖాయమని, అయినా సరే శ్రేణులు ఉదాసీనంగా ఉండొద్దని సూచించారు. కౌంటింగ్ సమయంలో ఏజెంట్లు, నేతలు టెన్షన్ పడొద్దని, తొందరపాటు చర్యలకు దిగొద్దని సూచించారు. హైదరాబాద్ లో చంద్రబాబును టీడీపీ నేతలు రామాంజనేయులు, నాగుల్ మీరా,చినరాజప్ప తదితరులు కలిసి కౌంటింగ్ సంబంధిత అంశాలపై చర్చించారు.
కాగా, తెలంగాణ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పోటీకి దూరంగా ఉన్న టిడిపి త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీకి సిద్ధంగా ఉండాలని తెలంగాణ టిడిపి నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. త్వరలోనే తెలంగాణ టిడిపి అధ్యక్షుడిని నియమిస్తామని అన్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలలో పోటీకి దూరంగా ఉండవలసిన పరిస్థితులను తెలంగాణ టిడిపి నేతలకు చంద్రబాబు వివరించారు. తెలుగుజాతి ఉన్నంతవరకు రెండు తెలుగు రాష్ట్రాలలో టిడిపి ఉంటుందన్నారు. ఏపీలో పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలపై దృష్టి సారించలేకపోయానని, ఇకపై సమయం కేటాయిస్తానని చంద్రబాబు అన్నారు.