గత ఏడాది ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ హిట్లలో ‘సలార్’ ఒకటి. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ రూపొందించిన ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా రిలీజై భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ఓవరాల్గా కూడా దాదాపు 700 కోట్ల వసూళ్లతో బ్లాక్బస్టర్ అయింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని విడుదలకు ముందే ప్రకటించారు.
ఇక సినిమా చివర్లో ‘శౌర్యాంగపర్వం’ పేరుతో పార్ట్-2 రాబోతున్నట్లు వెల్లడించారు. వీలైనంత త్వరగా సలార్-2 తీయడానికి ప్రశాంత్ నీల్ సన్నాహాలు చేస్తున్న విషయం కూడా బయటికి వచ్చింది. కానీ ఇప్పుడేమో ‘సలార్-2’ ఆగిపోయినట్లుగా సోషల్ మీడియాలో గట్టి ప్రచారం జరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తి ఈ సినిమాను పక్కన పెట్టేశారని.. ఈ సినిమా ఉంటుందో లేదో.. ఉన్నా ఎప్పుడు షూట్ చేస్తారో తెలియదని వార్తలు పుట్టించేసి ప్రచారం చేస్తున్నారు.
ఐతే ‘సలార్’ టీం వర్గాల ప్రకారం ఇది ఉత్త ప్రచారమేనట. ‘సలార్’ లాంటి బ్లాక్బస్టర్ మూవీకి సీక్వెల్ అంటే ప్రేక్షకుల్లో ఎంత ఆసక్తి ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. సినిమా చివర్లో ‘శౌర్యాంగ పర్వం’ గురించి ఇచ్చిన హింట్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచింది. ‘సలార్’ను మించి ‘సలార్-2’ ఉంటుందన్న అంచనాతో ఉన్నారు. ఈ సినిమా ఈజీగా వెయ్యి కోట్ల ఆదాయం తెచ్చిపెడుతుందనడంలో సందేహం లేదు. అలాంటి క్రేజీ ప్రాజెక్టును ఎవరైనా ఆపేస్తారా? వాస్తవం ఏంటంటే.. ‘సలార్-2’ను వెంటనే మొదలుపెట్టకుండా ప్రశాంత్ కొంచెం గ్యాప్ తీసుకుంటున్నాడు.
వరుసగా కేజీఎఫ్, కేజీఎఫ్-2, సలార్ తీసి అలసిపోయానని.. తనకు కొంచెం గ్యాప్ కావాలని ఈ మధ్యే ఒక వీడియో చాట్లో ప్రశాంత్ తెలిపాడు. ఈలోపు ప్రభాస్ రాజా సాబ్’ పూర్తి చేస్తాడు. వీలైతే హను రాఘవపూడి సినిమాను కూడా లాగించేయొచ్చు. అంతే తప్ప ‘సలార్-2’ను పక్కన పెట్టడం అన్నది పూర్తిగా అవాస్తవమని తెలుస్తోంది. ప్రభాస్ లాంటి వ్యక్తి క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటూ మధ్యలో ఓ ప్రాజెక్టు నుంచి బయటికి వస్తాడని అనుకోవడం పొరపాటు.