ఈవీఎం ధ్వంసం కేసులో పిన్నెల్లి పై జూన్ 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. ముందస్తు బెయిలు మంజూరు చేసింది. కానీ ఇప్పటివరకూ పిన్నెల్లి మాత్రం బయటకు రాలేదు. బెయిల్ వచ్చినా ఆయన కనిపించడం లేదు. దీంతో పిన్నెల్లి విదేశాలకు పారిపోయారనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. ఎలాగో వైసీపీ ఓడిపోతుందని భావించిన ఆయన.. అరెస్టులు, కేసులకు భయపడి మరికొంత కాలం ఇలాగే దాగి ఉంటారనే ప్రచారమూ జోరుగా సాగుతోంది.
ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో సిటింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకం సృష్టించారు. ఈవీఎం, వీవీ ప్యాట్‌ను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఆదేశించింది. కానీ ఆయన పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుని తిరుగుతున్నారు. ఈ లోపు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయనకు బెయిలు మంజూరు చేసిన కోర్టు జూన్ 6 వరకు చర్యలు తీసుకోవద్దని పేర్కొంది.
కోర్టు ఆదేశాల తర్వాత అయినా పిన్నెల్లి జనంలోకి వస్తారేమోనని వైసీపీ కార్యకర్తలు అనుకున్నారు. కానీ ఆయన బయటకు రావడం లేదు. ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యేదాకా మాచర్లకు వెళ్లొద్దని కోర్టు ఆయనకు షరతులు విధించింది. అలాగే సాక్ష్యులను బెదిరించకూడదని చెప్పింది. కేసు విషయంపై మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని కూడా పేర్కొంది. అందుకే ఆయన మీడియా ముందుకు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. అయితే పిన్నెల్లి దేశంలోనే ఉంటే కేసు గురించి కాకపోయినా చంద్రబాబుపై విమర్శలు చేసేందుకైనా మీడియా ముందుకు వచ్చేవారని మరో వర్గం అభిప్రాయపడుతోంది. పల్నాడు పులి అని వైసీపీ కార్యకర్తలు చెబుతున్న పిన్నెల్లి ఇప్పుడు పిల్లిలా దాక్కున్నారని టీడీపీ కౌంటర్ వేస్తోంది.