ఈ నెల 13న ఏపీలో జరిగిన ఎన్నికల పోలింగ్ సందర్భంగా మాచర్లలో చోటు చేసుకున్న హింసాత్మక ఘట నలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్నారెడ్డి ఈవీఎంను, వీవీప్యాట్‌ను కూడా ఎత్తి నేలకేసి కొట్టిన ఘటన మరింతగా జాతీయ స్థాయిలో దుమారం రేపింది. ఈ ఘటనలో చాలా రోజులు డ్రామా చోటు చేసుకుంది. 13వ తారీకు ఘటన చోటు చేసుకుంటే.. 20వ తేదీ వరకు కూడా ఈ ఘటన వెలుగు చూడలేదు.
పైగా.. ఈ మధ్య కాలంలోనే(13-20లోపు) ఎమ్మెల్యే పిన్నెల్లి కూడా తప్పించుకుని వెళ్లిపోయారు. ఆయనను వెతుకుతున్నామని చెప్పిన పోలీసులు ఒకవైపు.. మరోవైపు హైకోర్టుకు వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి న్యాయవాదులు మరోవైపు.. మొత్తంగా ఈ ఎపిసోడ్ అయితే.. చాలా ఉత్కంఠగా.. మారింది.. అంతే తేలికగా తేలిపోయింది. దీనిలో మొత్తంగా ఎవరు ఎవరిని వెంటాడారనేది మాత్రం స్పష్టం కాలేదు. తప్పించుకు న్న పిన్నెల్లి ఒకవైపు.. ఆయనను వెతికి కూడా.. పట్టుకోలేక పోయిన పోలీసులు మరోవైపు. ఈ వ్యవహారాన్నే ఇప్పుడు మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ కుమార్.. పాయింట్ ఔట్ చేశారు.
ఏపీలో పరిణామాలు చూస్తే.. ఎలుకల పిల్లిని తరిమినట్టుగా ఉందని ఆయన పేర్కొన్నారు. వీడియోకు చిక్కిన ఎమ్మెల్యే పిన్నెల్లిని వ్యవస్థలు అరెస్టు చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. “ఎలుకలు పిల్లిని వెంబడించిన కేసు“గా ఆయన అభివర్ణించారు. తాజాగా ఎక్స్ లో ఆయన చేసిన పోస్టు.. ఏపీలో పోలీసుల పనితీరును నిశితంగా విమర్శించినట్టుంది.
“ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు, రెవెన్యూ అధికారులు నిరంతరం ఎమ్మెల్యేల సేవలో తరిస్తుంటారు. డబ్బులతో తడిచిన చేతులు.. పట్టుకునేందుకు సహకరించవు. ఎన్నికల సమయంలో డబ్బు, అధికార బల ప్రదర్శన సర్వసాధారణంగా మారింది. కేన్సర్ అత్యంత ప్రమాదకరం.. అత్యంత వేగంగా విస్తరిస్తుందన్న విషయాన్ని ఇది నిజం చేసింది. డబ్బులతో తడిచిన చేతులు ఎలా పట్టుకుంటాయి? ఇప్పటికీ.. అధికారానిదీ.. మాఫియారాజ్దే పైచేయిగా ఉంది. అయినా..దీనిని ప్రజాస్వామ్యంగా నటిస్తాం“ అని అని పీవీ రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.