మాచర్ల నియోజకవర్గం లోని పాలవాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేసిన ఘటన ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో, ఈసీ ఆదేశాల ప్రకారం పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే అనూహ్యంగా పరారీలో ఉన్న పిన్నెల్లి నరసరావుపేటలోని కోర్టులో లొంగిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే నరసరావుపేట కోర్టు వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
అయితే, అందరికీ షాక్ ఇస్తూ ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ ఏపీ హైకోర్టులో పిన్నెల్లి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఏపీ హైకోర్టు విచారణ ప్రారంభించింది. ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పిన్నెల్లి నేరం రుజువైతే గరిష్టంగా ఆయనకు ఏడేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది.
అయితే, పిన్నెల్లికి ముందస్తు బెయిల్ ఇచ్చే ముందు తమ వాదనలను కూడా పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం కోర్టును కోరింది. ఈ ప్రకారం రాష్ట్ర పోలీసులతో సీఈసీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయించింది. పిన్నెల్లికి ముందస్తు బెయిల్ లభించే అవకాశాలు దాదాపుగా లేవని తెలుస్తోంది.