ఒక్క క్షణం ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుని ఉంటే.. ఒక్క నిమిషం పాటు తాను ఎమ్మెల్యేననే విషయాన్ని గుర్తుంచుకుని ప్రవర్తించి ఉంటే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పరిస్థితి వేరేలా ఉండేది. అందరిలా ఫలితాల కోసం ఎదురు చూస్తూ, తామే గెలుస్తామని చెప్పుకుంటూ ఉండేవారు. కానీ విచక్షణ మరిచి ఒక్కసారిగా రౌడీగా మారిపోయి ఈవీఎంను బద్దలుకొట్టడంతో ఇప్పుడు ఆయన పొలిటికల్ కెరీరే ప్రమాదంలో పడింది. ఈ ఘటనతో పిన్నెల్లి పొలిటికల్ ఫ్యూచర్ ఖతమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ సిటింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఈ ఎన్నికల్లో మరోసారి గెలిచినా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సస్పెన్షన్ ఎదుర్కొనే అవకాశం ఉందన్నది రాజకీయ విశ్లేషకుల మాట.
పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటు గ్రామంలోని పోలింగ్ బూత్‌లో పిన్నెల్లి విధ్వంసం సృష్టించారు. ఈవీఎంలను బద్దలు కొట్టారు. వీవీప్యాట్లనూ విసిరేశారు. ఆ ఘటన జరిగి ఇన్ని రోజులైనా విషయం వెలుగులోకి రాలేదు. కానీ ఇప్పుడు వెబ్‌క్యాస్టింగ్ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు బయటకు రావడం పిన్నెల్లికి ప్రమాదంగా మారింది. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పిన్నెల్లిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు పిన్నెల్లి పరారీలో ఉన్నారు.
ఇక పిన్నెల్లిపై ఇప్పటికే ఐసీసీ 143, 147, 448, 427, 353, 452, 120బి, ఆర్పీ చట్టంతో పాటు 131, 135 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన నేరం రుజువైతే ఏడేళ్ల జైలు శిక్ష పడటం ఖాయమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కనీసం రెండేళ్లు జైలు జీవితం గడిపినా ఎన్నికల్లో పోటీ పడేందుకు నేతలు అనర్హులవుతారు. ఈ నేపథ్యంలో ఒకవేళ పిన్నెల్లికి శిక్ష పడితే ఆయన రాజకీయ జీవితం ముగిసినట్లే. మరోవైపు ఈ కేసు నుంచి తప్పించుకున్నా ఇంత చేసిన ఆయన్ని మళ్లీ జనాలు గెలిపించే అవకాశాలు లేనట్లే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మాచర్ల నుంచి నాలుగు సార్లు (ఉప ఎన్నిక కలుపుకొని) ఎమ్మెల్యేగా గెలిచిన పిన్నెల్లి పొలిటికల్ కెరీర్‌కు ఇదే ఎండ్ కార్డు అని చెబుతున్నారు.