తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కుటుంబంతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగ ళవారం రాత్రికే తిరుమల చేరుకున్న ఆయన స్థానికం గెస్ట్ హౌస్‌లో బస చేశారు. బుధవారం వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. మనవడి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం.. మీడియాతో మాట్లాడిన రేవంత్.. ఏపీతో తెలంగాణకు ఉన్న సంబంధాలపై వ్యాఖ్యానించారు. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను కోరుకుంటున్నామని చెప్పారు.
ఏపీలో జరిగిన ఎన్నికలపై మాట్లాడుతూ.. ఏపీలో ఎవరు గెలుస్తారనేది తాను చెప్పబోనని అన్నారు. అయి తే.. ఎవరు అధికారంలోకి వచ్చినా… దాయాది రాష్ట్రంగా తమ సహకారం ఉంటుందని తెలిపారు. ఇరు రాష్ట్రాల మధ్య కూర్చుని చర్చించుకునే అంశాలు చాలానే ఉన్నాయన్న ఆయన.. ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణం స్వీకారం చేసినా.. ఆయా సమస్యలపై తాను చర్చిస్తానని.. ముఖ్యమంత్రిని కలిసి.. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఇదేసమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితిని ప్రస్తావించేందుకు కూడా.. రేవంత్ ఇష్టపడలేదు. అయితే .. పార్టీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ఇండియా కూటమి వచ్చే అవకాశం లేదన్న సర్వేలు సరికాదన్నారు. రాహుల్‌గాంధీని ప్రధానిగా చూడాలన్నది తన ఆశయమని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ది చెందాలని.. కోరుకుంటున్నట్టు తెలిపారు. కాగా, ఆలయానికి వచ్చిన రేవంత్ రెడ్డికి.. ఈవో ధర్మారెడ్డి దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేయించారు.