ఏపీలో పోలింగ్ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి..ఈవీఎంను బద్దలు కొట్టిన వైనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ క్రమంలోనే పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పరారీలో ఉన్న పిన్నెల్లి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే, పిన్నెల్లి అరాచకాన్ని అడ్డుకునేందుకు ఆ బూత్ లో టీడీపీ ఏజెంట్గా ఉన్న శేషగిరిరావు తీవ్రంగా ప్రయత్నించారు. ఆ కారణంతోనే శేషగిరిరావుపై వైసీపీ కార్యకర్తలు మారణాయుధాలతో దాడి చేశారని,.ఆయనకు గాయాలయ్యాయని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే శేషగిరిరావుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. శేషగిరిరావు ఆరోగ్య పరిస్థితి గురించి స్వయంగా అడిగి తెలుసుకున్నారు. శేషగిరిరావుకు పార్టీ అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని చంద్రబాబు భరోసానిచ్చారు. ఈవీఎం ధ్వంసం చేస్తున్న సమయంలో పిన్నెల్లి, ఆయన అనుచులను ధైర్యంగా అడ్డుకునే ప్రయత్నం చేశారని అభినందించారు.
వాస్తవానికి తనపై దాడి తర్వాత శేషగిరిరావు అజ్ఞాతంలోకి వెళ్లారు. తాజాగా పిన్నెల్లిపై కేసు నమోదు కావడంతో శేషగిరిరావు అజ్ఞాతం వీడి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆయనకు చంద్రబాబు ఫోన్ చేశారు. పిన్నెల్లి వీధిరౌడీలా ప్రవర్తించారని, ఎమ్మెల్యే చర్యలకు ఓటర్లు భయభ్రాంతులకు గురయ్యారని తెలిపారు.