ఏపీలో పోలింగ్ అనంతరం తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద చంద్రగిరి టిడిపి అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడిన వైనం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పులివర్తి నానికి ప్రాణహాన్ని కలిగించే రీతిలో జరిగిన దాడి నుంచి ఆయన తృటిలో తప్పించుకుని బయటపడ్డారు. ఈ నేపథ్యంలోనే నానిపై దాడికి పాల్పడిన ప్రధాన నిందితులు భాను కుమార్ రెడ్డి, గణపతి రెడ్డిలతో పాటు మరో 11 మందిని పోలీసులు ఈ రోజు అరెస్టు చేశారు. వారిని న్యాయమూర్తి ఎదుట హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించడంతో చిత్తూరు జైలుకు వారిని తరలించారు. ఈ నేపథ్యంలోనే నానిపై జరిగిన దాడి వ్యవహారంపై టిడిపి నేత, ఉండి టిడిపి అభ్యర్థి రఘురామ కృష్ణ రాజు స్పందించారు.
నాని అదృష్టవశాత్తు బతికి బయటపడ్డారని, అరక్షణం వేగంగా ఆయన స్పందించిన తీరే ఆయనను బతికించిందని రఘురామ అన్నారు. సమ్మెట దెబ్బ కణతకు తగిలి ఉంటే ఆయన ప్రాణం పోయి ఉండేదని చెప్పారు. 20 ఏళ్ల కిందట చిత్తూరులో ఇటువంటి ఘటనలు జరిగాయని, 20 ఏళ్ల తర్వాత ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఇటువంటి ఘటనలు జరగడం దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు.
పద్మావతి యూనివర్సిటీ దగ్గర కట్టుదిట్టమైన భద్రత ఉందని, అయినప్పటికీ దుండగులు అక్కడికి మారణాయుధాలతో ఎలా ప్రవేశించారని ప్రశ్నించారు. ఇటువంటి ఘటనల ద్వారా తమ ఓటమిని వైసిపి పరోక్షంగా అంగీకరించిందని విమర్శించారు. జగన్ డిప్రెషన్ లో ఉండబట్టే ఈ రోజు ఐ ప్యాక్ దగ్గరికి వెళ్లారని, ఇలాగే డీలా పడితే కౌంటింగ్ సెంటర్లలో కూడా ఏజెంట్లు ఉండరు అన్న సలహాతోనే ఈరోజు జగన్ వచ్చినట్లుగా తనకు సమాచారం ఉందని ఆరోపించారు.
ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నామో ఐ ప్యాక్ సభ్యులు… జగన్ కు చెప్పాలని, కానీ ఇన్ని స్థానాలు గెలుస్తున్నాం అంటూ ఆయనే ఐ ప్యాక్ సభ్యులకు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ స్థానాలు ట్రెండ్ ప్రకారం కూటమికి 155 అసెంబ్లీ స్థానాలు వచ్చినా ఆశ్చర్యం లేదని జోస్యం చెప్పారు.