ఐప్యాక్ టీంతో చిట్ చాట్ నిర్వహించిన వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికల ఫలితాలపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించామని, ఈసారి దేశమంతా ఏపీవైపు చూసి షాకయ్యేలా అంతకు మించి సీట్లు సాధిస్తామని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఇక మరో అడుగు ముందుకు వేసిన మంత్రి బొత్స సత్యనారాయణ…సీఎం జగన్ ప్రమాణస్వీకారం చేసే తేదీ, ప్లేస్ కూడా చెప్పేశారు. ఏపీలో రెండోసారి వరుసగా వైసీపీ జెండా ఎగరడం ఖాయమని, జూన్ 9న విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని బొత్స చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ వ్యాఖ్యలకు టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ కౌంటర్ ఇచ్చారు.
జూన్ 4న ఎన్నికల ఫలితాలు చూసి జగన్ షాక్ కు గురవుతాడని, వైసీపీ ఘోర పరాజయం చూసి దేశమంతా ఆశ్చర్యపోతుందని ఉమా ఎద్దేవా చేశారు. అదే రోజున ప్రజలు సంతోషపడతారని, కూటమి గెలుపు చూసి హర్షిస్తారని అన్నారు. ఐదేళ్ల అరాచకం, అవినీతి, లంచగొండి పాలన, దుర్మార్గపు పాలన చూసి దేశ విదేశాల నుంచి కూడా ఓటర్లు వచ్చి వైసీపీకి వ్యతిరేకంగా, కూటమి గెలుపుకు అనుకూలంగా ఓటు వేశారని ఉమా చెప్పారు. ఓటమి భయంతో వైసీపీ హింసకు పాల్పడుతున్నా బెదరకుండా మహిళా ఓటర్లు పల్నాడులో కూటమికి అనుకూలంగా ఓటు వేశారని గుర్తు చేశారుజ.
ఐదేళ్లు ఏం ఉద్ధరించావని మళ్లీ అధికారంలోకి వస్తానని కలలు కంటున్నావు జగన్ రెడ్డి అని ప్రశ్నించారు. అప్పట్లో హిట్లర్ కోసం గోబెల్స్ ప్రచారం చేసిన మాదిరిగా ఇప్పుడు జగన్ కోసం సజ్జల కూడా ప్రచారం మొదలుబెట్టారని సెటైర్లు వేశారు. కడప ఎంపీ సీట్ కూడా తామే గెలవబోతున్నామని, వై నాట్ పులివెందుల అన్న తమ మాట నిలబెట్టుకుంటామని ఉమా ధీమా వ్యక్తం చేశారు. కూటమి గెలుపు ఖాయం అయిందని దేశమంతా ఘోషిస్తుందని, అది చూసి తట్టుకోలేక మూడు రోజుల తర్వాత ఈరోజు జగన్ బయటకు వచ్చాడని ఎద్దేవా చేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వాలంటీర్ల ద్వారా ఐపాక్ టీంకు కట్టబెట్టిన వైనంపై రాబోయే కూటమి ప్రభుత్వం పరిశీలన చేస్తుందని ఉమా అన్నారు.