వైసీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన జంగా కృష్ణమూర్తిపై తాజాగా అనర్హత వేటు పడింది. 2024 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి పార్టీ ఫిరాయించిన జంగా కృష్ణమూర్తిని సస్పెండ్ చేస్తూ శాసనమండలి చైర్మన్ మోషెస్ రాజు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఆధారంగా ఆయనపై అనర్హత వేటు వేశానని చెప్పారు. టిడిపిలో చేరిన జంగా కృష్ణమూర్తిపై వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో శాసనమండలి చైర్మన్…వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన విచారణ జరిపారు. ఈ క్రమంలోనే జంగా కృష్ణమూర్తిపై తాజాగా వేటు వేశారు.
పల్నాడు జిల్లాలోని గురజాల మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఎన్నికలకు కొద్ది రోజులు ముందు వైసీపీని వీడి టిడిపిలో చేరిన సంగతి తెలిసిందే. గురజాల నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జంగా కృష్ణమూర్తి బలమైన బీసీ నేతగా నియోజకవర్గంలో పేరు సంపాదించుకున్నారు. అయితే, 2024లో వైసీపీ తరఫున గురజాల ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ జంగా కృష్ణమూర్తి ఆ తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పి టిడిపిలో చేరారు.
గురజాల నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి, టిడిపి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుతో కలిసి ఎన్డీఏ కూటమి విజయం కోసం జంగా కృష్ణమూర్తి కూడా ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తి యరపతినేనితో కలిసి నియోజకవర్గ వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు నిర్వహించారు.