వైసీపీ ఫైర్ బ్రాండ్ మహిళా నేత, మంత్రి రోజా కు సొంత పార్టీలోనే చాలా కాలంగా వ్యతిరేక పవనాలు వీస్తున్న సంగతి తెలిసిందే. నగరిలో తనకు వ్యతిరేకంగా చాలామంది వైసీపీ నతేలు పనిచేస్తున్నారని స్వయంగా రోజా కూడా చాలాసార్లు చెప్పారు. మరోవైపు, నియోజకవర్గంలో ప్రజల నుంచి కూడా రోజాకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమమవుతోంది. ఈ నేపథ్యంలోనే పోలింగ్ రోజున కూడా తన వ్యతిరేక వర్గంపై రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నుంచి నామినేటెడ్ పదవులు తీసుకున్న వ్యక్తులు చివరి నిమిషంలో పార్టీ మారి తన ఓటమికి పనిచేస్తున్నారని రోజా సంచలన ఆరోపణలు చేశారు. మరికొందరు సొంత పార్టీ నేతలు తనను ఓడించాలని చూస్తున్నారని, ఇలా చేయడం దురదృష్టకరమని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీతో తనకు ఏ ప్రాబ్లం లేదని, కానీ, వడమాలపేటలో మురళీధర్ రెడ్డి వైసీపీ తరఫున గెలిచిన జడ్పీటీసీ చివరి నిమిషంలో టీడీపీకి వెళ్లి తనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరిలో కేజే కుమార్…జగన్ ను ఎయిర్పోర్టులో కలిసి దండం పెడతారని, కానీ, నగరికి వచ్చి టీడీపీకి ఓటు వేయమని ప్రచారం చేస్తుంటారని ఆరోపించారు. చక్రపాణి రెడ్డికి శ్రీశైలం ఛైర్మన్ పదవి ఇచ్చినా..లాస్ట్ మినిట్ లో టీడీపీకి వెళ్లారని, పుత్తూరులో అమ్ములు కూడా తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ వాళ్లు ఎక్కడా లేరని, వైసీపీ నుంచి వెళ్లిన దొంగలే ఈ రోజు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని రోజా ఆరోపించారు.