ఏపీలో మునుపెన్నడూ లేనివిధంగా భారీగా పోలింగ్ జరిగే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. తెల్లవారుజామున నుంచే ఓటు వేసేందుకు మహిళలు, యువకులు, వృద్ధులు ఇలా అన్ని వర్గాల వారు వయసులవారు బారులు తీరడంతో పోలింగ్ శాతం 80-85 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఏపీలో ఓటరు చైతన్యం వికసించిందని, భారీగా తరలివచ్చి ఓట్లు వేసిన ఓటర్లకు ధన్యవాదాలు చెబుతున్నానని చంద్రబాబు అన్నారు.
ఇది ఏపీకి చరిత్రాత్మక దినమని, ప్రజా సంకల్పం, ఉత్సాహం స్ఫూర్తిదాయకమని చెప్పారు. పోలింగ్ ముగిసే సమయంలో కూడా ఉత్సాహంగా ఓట్లు వేసేందుకు క్యూ లైన్ లో నిలబడ్డారని, వారందరినీ అభినందిస్తున్నానని చంద్రబాబు అన్నారు. అర్ధరాత్రి వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి బూత్ వద్ద విద్యుత్ సరఫరా, ఫ్యాన్స్, జనరేటర్లు వంటి ఏర్పాట్లు చేసేలా ఈసీ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. గత ఎన్నికల్లో దాదాపు 80 శాతం పోలింగ్ జరిగిందని, ఈసారి పోలింగ్ పరిశీలిస్తే 85% వరకు పోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లుగా చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
మరోవైపు, పోలింగ్ సరళిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా స్పందించారు. ప్రజాతీర్పు తారుమారు చేసేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాలన్నింటినీ ఓటర్లు తిప్పి కొట్టారని, పోలింగ్ కేంద్రాలకు భారీ సంఖ్యలో చేరుకొని తమ ఓటుతోనే సమాధానం చెబుతున్నారని లోకేష్ అన్నారు. ఓటు వేసేందుకు భారీగా తరలివచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి లోకేష్ అభినందనలు తెలిపారు. బారులు తీరిన ఓటర్లు వెల్లువిరిసిన ప్రజా చైతన్యానికి నిదర్శనమన్నారు. భావితరాల భవిష్యత్తు కోసం ఏపీ ప్రజలు చూపిన తెగువ చరిత్ర పుటల్లో నిలిచిపోతుందన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉప్పెనలా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తిన ఓటర్ దేవుళ్ళకు పాదాభివందనాలు చేస్తున్నానని లోకేష్ అన్నారు. పార్టీ కోసం ప్రాణాలకు సైతం తెగించి శ్రమించిన టీడీపీ నేతలు, కార్యకర్తలకు లోకేష్ ధన్యవాదాలు తెలిపారు.