ఏపీ సీఎం జగన్ 2024 ఎన్నికలలో ఓడిపోబోతున్నారని మాజీ రాజకీయ వ్యూహకర్త, ఐ ప్యాక్ మాజీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే గతంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో జగన్ ను ముఖ్యమంత్రిని చేయడంలో కీలక పాత్ర వహించిన పీకే ఈసారి మాత్రం జగన్ గెలిచే ప్రసక్తే లేదంటూ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మరికొద్ది గంటల్లో ఏపీలో పోలింగ్ మొదలు కాబోతున్న నేపథ్యంలో తాజాగా మరోసారి జగన్ గెలుపు, ఓటములపై పీకే చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.
2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఘోర ప్రభావం తప్పదని పీకే షాకింగ్ కామెంట్లు చేశారు. ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారం రేపాయి. ఏడాదిన్నర క్రితం తాను జగన్ ను కలిశానని, అప్పుడే ఈ విషయం స్పష్టంగా చెప్పానని పీకే అన్నారు.
2019లో వైసీపీ గెలుపు కోసం నవరత్నాలను తానే సూచించానని పీకే చెప్పారు. కానీ, గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో జగన్ రాష్ట్రానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదని పీకే ఆరోపించారు.
3 రాజధానుల ఐడియా తాను ఇవ్వలేదని, తాను ఎన్నికల వ్యూహాలు మాత్రమే రూపొందించి ఇస్తానని, పాలనాపరమైన విషయాలలో ఎన్నడూ జోక్యం చేసుకోలేదని క్లారిటీనిచ్చారు. నవరత్నాలు జగన్ గెలుపునకు ఉపయోగపడ్డాయని, కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ ప్రభుత్వంలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సింది పోయి జగన్త నవరత్నాలు దగ్గరే ఆగిపోయారని విమర్శించారు.
ఏపీలో రాజధాని నిర్మాణంతోపాటు చాలా పనులున్నాయని, పోలవరం, పరిశ్రమలు, ఉద్యోగాలు పట్టించుకోకుండా నవరత్నాలు, సంక్షేమ పధకాలకే జగన్ పరిమితమైతే దానికి తాను బాధ్యుడిని కాదని అన్నారు. జగన్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి తాను హాజరు కాలేదని, బిహార్ వెళ్ళిపోయానని, 3 రాజధానుల ఐడియా తనది కాదని స్పష్టం చేశారు.
పరిపాలనా వికేంద్రీకరణకు పంచాయితీ రాజ్ వ్యవస్థ, లక్షలాది మంది ఉద్యోగులు ఉన్నారని, కానీ, లక్షన్నర మంది వాలంటీర్లతో ఓ ప్రైవేట్ సైన్యం జగన్ ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. జగన్ బటన్ నొక్కగానే వాలంటీర్లు ఆ డబ్బును లబ్ధిదారులకు ఇవ్వడం, వారి ఖాతాల్లో పడడం జరుగుతోందని చెప్పారు. పంచాయితీరాజ్ వ్యవస్థ, దానిలో పనిచేసే సర్పంచ్లు, కార్యదర్శులు, సిబ్బంది…ఆఖరికి ప్రజా ప్రతినిధులకు కూడా సంక్షేమ పధకాల చెల్లింపులతో సంబంధం లేకుండా చేశారని ఆరోపించారు.
జగన్ ఏదో ఆశించి ఏదో చేస్తే చివరికి మరేదో జరగబోతోందని అన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ వ్యవస్థలను, యంత్రాంగాన్ని ఉపయోగించుకోకుండా, వాలంటీర్ సైన్యం ద్వారా ఖజానాపై అదనపు భారం మోపి ప్రభుత్వానికి, పార్టీకి నష్టం చేకూర్చుకున్నారని పీకే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఏది ఏమైనా పోలింగ్ కు మరికొద్ది గంటల ముందు జగన్ ఓడిపోతారంటూ పీకే చేసిన వ్యాఖ్యలు వైసీపీకి భారీ డ్యామేజీ చేసేలా కనిపిస్తున్నాయి.