ఏపీ సీఎం జగన్ గురించి ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. చెల్లెళ్లకే న్యాయం చేయలేని వాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు.. గ్రాబింగ్ యాక్ట్.. ఇలా అనేక అంశాలపై జగన్‌ను ఉక్కిరి బిక్కిరికి గురి చేశారు. అయితే.. చివరి రోజు ప్రచారంలో మాత్రం అనూహ్యంగా సీఎం జగన్ గురించి కొత్త పాయింట్ లేవనెత్తి.. మరో సంచలనం సృష్టించారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజు శనివారం సాయంత్రం .. కాకినాడ పార్లమెంటు పరిధిలో పవన్ ప్రచారం చేశారు. ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీ-టైమ్ శ్రీనివాస్ పోటీలో ఉన్నారు.
ఆయన తరఫున ప్రచారం చేసిన పవన్.. సాధారణ విమర్శలతోపాటు.. జగన్‌పై సరికొత్త వ్యాఖ్య చేశారు. “ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్లాలంటే కోర్టుల అనుమతి కోరే వ్యక్తి మనకు ముఖ్యమంత్రా? “ అని ప్రశ్నించారు. “అంతేకాదు.. విదేశాలకు వెళ్లాలంటే కూడా.. ఈ ముఖ్యమంత్రికి అనుమతి కావాలి. ఇలాంటి వాళ్లు మనకు అవసరమా?“ అంటూ.. కొత్త పాయింట్‌తో విరుచుకుపడ్డారు. ఇలాంటి వారిని గెలిపించి సాధించేదేంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రజల మైండ్ సెట్ మార్చుకోవాలని పవన్ సూచించారు. ఓటు అనే ఆయుధంతో ఇలాంటి వారిని తరిమి కొట్టాలన్నారు.
సోమవారం పోలింగ్ జరగనుందన్న పవన్.. ఈ ఎన్నికలు మీకోసమే కాదని.. రాష్ట్ర భవిష్యత్తు కోసమని చెప్పారు. రాష్ట్రాన్ని మాఫియా నుంచి గంజాయి, బ్లేడు బ్యాచ్ కబంద హస్తాల నుంచి కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపు నిచ్చా రు. రాష్ట్రాన్ని కాపాడాలని కోరారు. కాగా.. కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీలో ఉన్న వైసీపీ నాయకుడు చెలమలశెట్టి సునీల్‌ను ఊసరవెల్లిగా అభివర్ణించారు. ఈయన టీడీపీ నుంచి వైసీపీలో చేరి టికెట్ దక్కించుకు్న్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సునీల్‌పై పవన్ విమర్శలు సంధించారు.
ఊసరవెల్లి వంటి సునీల్‌ను ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి వారిని గెలిపిస్తే.. ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఇదిలావుంటే.. కాకినాడ పరిధిలో జనసేన అధినేత పవన్.. మొత్తం 12 సార్లు ప్రచారం చేశారు. ఇక్కడ నుంచి పోటీలో ఉన్న టీ-టైం అధినేత ఉదయ్ శ్రీనివాస్ తరఫున ఆయన అత్యధిక సంఖ్యలో ప్రచారం నిర్వహించారు. పిఠాపురంలో 8 సార్లు ప్రచారం చేశారు.