ఆడబిడ్డ ఏడిస్తే ఇంటికి మంచిది కాదంటారు. ఇప్పుడు ఆ ఆడబిడ్డల కన్నీళ్లే వైసీపీ అధినేత, సీఎం జగన్ ను ముంచేయబోతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికారం కాపాడుకోవడం మరీ ఇంతలా దిగజారాలా? ఇంటి ఆడబిడ్డలపై లేనిపోని నిందలు మోపాలా? అని జగన్‌ను జనాలు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ఏపీ కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. తమ చిన్నాన్న వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు అవినాష్‌ను ఓడించడమే లక్ష్యంగా ఆమె సాగుతున్నారు. షర్మిలకు వివేకా తనయ సునీత, భార్య సౌభాగ్యమ్మ మద్దతుగా నిలిచారు.
వివేకా హత్యకు కారణం అవినాష్ అని, ఆయన వెనుక జగన్ ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. షర్మిల కూడా ఇదే విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో షర్మిల, సునీత, సౌభాగ్యమ్మ జట్టు కట్టడం మింగుడుపడని జగన్ వ్యక్తిగత విమర్శలకూ వెనుకాడటం లేదు. తన పార్టీ సోషల్ మీడియా విభాగం ద్వారా షర్మిల, సునీతపై తీవ్రమైన విమర్శలు, వ్యక్తిగతంగా దిగజారుడు వ్యాఖ్యలు చేయిస్తున్నారనే టాక్ ఉంది. దీనిపై షర్మిల తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యారు. ఒకప్పుడు జగన్ కోసం పాదయాత్ర చేసిన తనను ఇలాంటి మాటలనడంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఒక్క కుటుంబంలోని వ్యక్తులు వేర్వేరు రాజకీయ పార్టీల్లో ఉండటం కామన్‌గా మారిపోయింది. కానీ ఇలా సొంత చెల్లి అని కూడా చూడకుండా జగన్ పార్టీ చేసే నీచమైన వ్యాఖ్యలు జనాలకూ అగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. చెల్లికి రాజకీయ కాంక్ష ఉందని, ఆమె వెనుక చంద్రబాబు ఉన్నారని జగన్ ఆరోపిస్తున్నారు. తనకే రాజకీయ కాంక్ష ఉంటే జగన్ కోసం ఎందుకు పాదయాత్ర చేస్తానని, అప్పుడే వైసీపీ నేతలను తనవైపు తిప్పుకునేదాన్ని అని షర్మిల అంటున్నారు.
రాజన్న బిడ్డను అని కూడా చూడకుండా తనపై లేనిపోని మాటలు అంటున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు. మరోవైపు వివేకా హత్య కేసులో న్యాయం జరగాలని పోరాడుతున్న సునీత కూడా భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఆడబిడ్డల ఉసురు ఊరికే పోదని, ఆ కన్నీళ్లే జగన్‌ను ముంచేస్తాయని ప్రజలు అంటున్నారు.