అదేంటి? అని షాక్‌కు గురయ్యారా? నిజమే. నిన్నటికి నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు మద్దతు పలికిన అల్లు అర్జున్.. జనసేనకు బద్ధ శత్రువైన వైసీపీ కి అనుకూలంగా ప్రచారం చేయడమేంటని అనుకుంటున్నారా.? నిజమే అల్లు అర్జున్ ప్రచారం చేశారు. కానీ, అది అందిరికీ కాదు.. తన స్నేహితుడు, నంద్యాల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి తరఫున మాత్రమే ఆయన ప్రచారానికి వచ్చారు.
అది కూడా.. వైసీపీకి ఓటేయాలని కానీ.. వైసీపీని గెలిపించాలని కానీ.. అల్లు ఎక్కడా పిలుపునివ్వలేదు. కేవలం శిల్పాకు మాత్రమే ఓటేయాలని చెప్పారు. నేరుగా నంద్యాలలోని శిల్పా ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ దంపతులు.. రవిచంద్రా రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచే అల్లు అర్జున్.. శిల్పాకు ఓటేయాలని చెప్పారు. శిల్పా చేతిలో చేయి వేసిన అల్లు అర్జున్.. వేలాదిగా తరలి వచ్చిన వారిని ఉద్దేశించి.. శిల్పాకే వేయండి! అని చెప్పారు.
ఇంతకుమించి ఆయన… వైసీపీ పేరు కానీ.. ఆపార్టీ ఊసుకానీ ఎత్తక పోవడం గమనార్హం. మరోవైపు తన చిన్న మేనమామ పవన్ కు మద్దతుగాసోషల్ మీడియాలో కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా అల్లు అర్జున్ శిల్పాకు మద్దతుగా ప్రచారం చేయడం క్షణాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చింది. దీనిపై ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు కానీ.. ప్రస్తుతం అల్లు అర్జున్ మాత్రం.. శిల్పాకు జై కొట్టారు. ఆయన తనకు స్నేహితుడని చెప్పారు. అదేవిధంగా శిల్పా భార్యకు, అల్లు సతీమణి.. ఫ్రెండ్ కావడం గమనార్హం.
అయితే, తమకు సమాచారం ఇవ్వకుండా, అనుమతి తీసుకోకుండా భారీ జన సమీకరణకు కారణమయ్యాని ఆరోపిస్తూ నోడల్ ఆఫీస్ ఇచ్చిన ఫిర్యాదుతో అల్లు అర్జున్, శిల్పాలపై పోలీసులు కేసు నమోదు చేశారు.