ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతు్నప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మీద ఆ రాష్ట్ర ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల వాళ్లలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈసారి ఎన్నికల్లో విజయం సాధించడం ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీలకు కూడా ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత పర్యాయం ఏకంగా 151 సీట్లతో భారీ విజయం సాధించిన వైసీపీ.. ఈసారి తీవ్ర వ్యతిరేకత మధ్య ఎన్నికల బరిలో నిలిచింది.
ఐతే, వ్యతిరేకత వల్ల సీట్లు తగ్గినా మరోసారి అధికారంలోకి వస్తామన్న ధీమాతో వైసీపీ ఉండగా.. వైసీపీకి వ్యతిరేకంగా పని చేసే అనేక అంశాలు కనిపిస్తుండడంతో కూటమికి ఘనవిజయం ఖాయమని టీడీపీ, జనసేన, బీజేపీ భావిస్తున్నాయి. కాగా ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మినీ ఎన్నికలుగా భావించిన పోస్టల్ బ్యాలెట్లో ప్రభుత్వ ఉద్యోగులు రెట్టించిన ఉత్సాహంలో పాల్గొన్నారు. ఓటింగ్ శాతం గతంలో కంటే దాదాపు డబులైంది. ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందనడానికి ఇది సూచికగా విశ్లేషకులు పేర్కొన్నారు. ఇప్పుడిక అసలు సమరానికి రంగం సిద్ధమవుతోంది. ఏపీలో ఓటు హక్కు కలిగి ఉండి వేరే ప్రాంతాల్లో ఉన్న వాళ్లు పెద్ద ఎత్తున స్వస్థలాలకు బయల్దేరారు. ప్రతిసారీ ఎన్నికలకు ఒకట్రెండు రోజుల ముందు పెద్ద ఎత్తున ఏపీకీ ఓటర్లతో కూడిన వాహనాలు రావడం మామూలే.
కానీ, ఈసారి ఆ ఒరవడి మరింతగా కనిపిస్తోంది. శుక్రవారం నుంచే హైవేలు భారీ ఎత్తున వాహనాలతో నిండిపోయాయి. ఈసారి ఓటు వేసి తీరాలన్న కసితో చాలామంది ఏపీకీ వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసీపీని ఓడించాలన్న కసితో వస్తున్న వాళ్లే ఇందులో ఎక్కువ శాతం ఉన్నట్లు కనిపిస్తోందని.. హైవేల్లో బారులు తీరిన వాహనాలు వైసీపీలో గుబులు పుట్టిస్తున్నాయని టీడీపీ, జనసేన మద్దతుదారులు పేర్కొంటున్నారు. ఈ అంచనా ఎంతమేర నిజమవుతుందో చూడాలి.