టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ మొదలు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి వరకు అందరిపై వైసీపీ సోషల్ మీడియా విభాగం విషం చిమ్ముతోందని ఆరోపణలున్న సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై దుష్ప్రచారం చేయడం…ఎన్నికల కోసం ఇళ్లలో మహిళలపై కూడా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం వైసీపీ సోషల్ మీడియాకు పరిపాటిగా మారిందన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబుపై వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి సజ్జల భార్గవ రెడ్డి నేతృత్వంలోని టీం చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
ఈ క్రమంలోనే ఆ వ్యవహారంపై ఈసీకి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా సజ్జల భార్గవ రెడ్డిపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వర్ల రామయ్య చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. వర్ల ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం… సజ్జల భార్గవరెడ్డిపై కేసు నమోదు చేయాలని సీఐడీని ఆదేశించింది. దీంతో, సజ్జల భార్గవరెడ్డిపై పలు సెక్ష్లన్ల ప్రకారం కేసు నమోదు చేశారు.