సాధారణంగా పోస్టల్ ఓటుకు పెద్దగా పోల్ కావటం ఉండదు. కొద్ది మంది తప్పించి పెద్దగా ఆసక్తి చూపటం కనిపించదు. అందుకు భిన్నంగా ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ.. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోస్టల్ ఓటు కోసం బారులు తీరుతున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఉద్యోగ.. ఉపాధ్యాయులు.. అంగన్ వాడీలు.. కాంట్రాక్టు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఓటు కోసం బారులు తీరుతున్నారు. గంటల కొద్దీ టైం తీసుకుంటున్నా పట్టించుకోకుండా ఉత్సాహంగా తమ ఓటుహక్కును నిర్వహించుకునేందుకు వెనక్కి తగ్గట్లేదు.
మండే ఎండల్లో క్యూలైన్ లో గంటల కొద్దీ నిలబడి ఓటు వేసేందుకు బారులు తీరుతున్న వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గతంలో ఏ ఎన్నికల్లోనూ ఇలాంటి పరిస్థితి చూడలేదన్న వ్యాఖ్యలు పోలింగ్ బూత్ ల వద్ద వినిపిస్తోంది. మొత్తం 4.30 లక్షల మంది పోస్టల్ బ్యాలట్లకు అప్లై చేసుకుంటే.. మంగళవారం నాటికి వారిలో 3.30 లక్షల మంది ఓట్లు వేశారు. వీరిలో 2.76 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు కావటం గమనార్హం. ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం ఏమంటే.. 2019లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న మొత్తం ఓటర్లు 2.38 లక్షలు కాగా.. ఈసారి ఇప్పటికే దాదాపు లక్ష ఓట్లు పోల్ కావటం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ఉద్యోగుల.. ఉపాధ్యాయుల ఓట్ల విషయంలో రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న వైనం కొత్త చర్చకు తెర తీసింది. ఒక పార్టీ తమకు ఓటేస్తే రూ.5 వేల వరకు ఆశ చూపుతుంటే.. అందుకు సానుకూలంగా సమాధానం రావటం లేదని చెబుతున్నారు. మరోవైపు ఇంకో ప్రధాన పార్టీ డబ్బులు ఆశ చూపటం లేదని చెబుతున్నారు. విచిత్రమైన అంశం ఏమంటే.. సదరు పార్టీకి ఉద్యోగ ఓటర్లే ఎదరు డబ్బులు ఇస్తూ.. ఎన్నికల ప్రచారానికి.. ఖర్చులకు డబ్బులు ఉంచుకోడంటూ ఇస్తున్న వైనం గతంలో ఎప్పుడూ లేదంటున్నారు.
పలువురి ఓట్లు లేవని సిబ్బంది తిప్పి పంపుతున్నా.. ఫాం2 దరఖాస్తు సమర్పిస్తున్నారు. అయినా తమ పేర్లు రాని సందర్భాల్లో ఒకటికి రెండుసార్లు తమ ఓటు కోసం ఆరా తీసి మరీ.. పట్టుబట్టి సాధించి మరీ ఓటేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. ఈ తీరు ఎవరికి అనుకూలంగా మారుతుంది? ఎవరికి ప్రతికూలం అవుతుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. గతంలో ఏ ఎన్నికల సందర్భంలోనూ ఉద్యోగులు ఇంత పట్టుదలతో ఓట్లు వేయటాన్ని తాము చూడలేదన్న మాట ఉద్యోగ సంఘాల ప్రతినిధుల నోట వినిపిస్తూ ఉండటం గమనార్హం.