చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన ప్రజాగళం సభలో మంత్రి పెద్దిరెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. జన ప్రభంజనంతో పుంగనూరు దద్దరిల్లిందని, ఇక్కడ పాపాల పెద్దిరెడ్డిని రాజకీయంగా భూస్థాపితం చేసే సరైన మొగుడు చల్లా బాబు అని అన్నారు. చల్లా బాబు ఓ బుల్లెట్ లా దూసుకెళతాడని, మిడిసిపడుతున్న పెద్దిరెడ్డికి కరెక్ట్ క్యాండిడేట్ అని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డికి నీకు పోలిక ఉందా? అని పెద్దిరెడ్డిని చంద్రబాబు ప్రశ్నించారు.
“పాపాల పెద్దిరెడ్డీ… నువ్వు ఎమ్మెల్యేవి, మంత్రివి, నీ కొడుకు ఎంపీ, నీ తమ్ముడు తంబళ్లపల్లె ఎమ్మెల్యే. మేమందరం నీకు బానిసలం అనుకుంటున్నావా పెద్దిరెడ్డీ? బాగా కొవ్వెక్కిపోయింది. పొగరుబోతు ఆంబోతుగా తయారయ్యాడు. ప్రజలే కొమ్ములు విరగ్గొట్టాలి. వీళ్ల రాజకీయ ఆధిపత్యానికి గండికొట్టడానికి కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడం ఖాయం. మళ్లీ నరేంద్ర మోదీనే ప్రధాని అవుతున్నారు. పాపాల పెద్దిరెడ్డీ ఇక నీకు నిద్రే ఉండదు. నిన్న మోదీ కూడా అన్నారు… ఎన్డీయే అంటే అభివృద్ధి అని వైసీపీ అంటే అవినీతి అని అన్నాడు. వైసీపీ అవినీతికి ఆద్యుడు ఇక్కడే ఉన్నాడు… ఇంకెవరు పాపాల పెద్దిరెడ్డే!’’ అని చంద్రబాబు దుయ్యబట్టారు.
బానిసలుగా బతకడం కంటే తిరుగుబాటు చేసి ఇలాంటివాళ్లను భూస్థాపితం చేస్తేనే ప్రజలకు అభివృద్ధి ఉంటుందని పిలుపునిచ్చారు. దోపిడీ కోసమా ఈ మంత్రి? శివశక్తి డెయిరీకి పోటీగా ఇతర డెయిరీలు రానిస్తున్నారా? ఇదేమైనా ఆయన అబ్బ సొత్తా? మామిడికాయల్లోనూ కమీషన్లు కొట్టేసిన దుర్మార్గుడు ఇతడు అని ధ్వజమెత్తారు. మంత్రులు వీళ్లే, ఎంపీలు వీళ్లే, కాంట్రాక్టర్లు వీళ్లే, మైనింగ్ వీళ్లదే, ఇసుక వ్యాపారం వీళ్లదే, మద్యం వ్యాపారం వీళ్లదే… ఇంకేమీ మిగలకుండా ఊడ్చేశాడు అంటూ పెద్దిరెడ్డిపై విమర్శలు గుప్పించారు.
కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ కూడా కొట్టేశారని, రూ.30 వేల కోట్లు అవినీతితో సంపాదించిన దుర్మార్గుడు ఈ పాపాల పెద్దిరెడ్డి! అని దుయ్యబట్టారు. జూన్ 4న ఆ డబ్బంతా కక్కిస్తా… ఆ డబ్బు పేదలకు పంచేస్తా అని చంద్రబాబు అన్నారు. అంతకుముందు, హైదరాబాదులో చంద్రబాబును కలిసిన తన్జీమ్ ఈ ముఫ్తియాన్ నేతలు..చంద్రబాబుకు మద్దతు పలికారు. ముస్లింల సర్వతోముఖాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని స్పష్టం చేశారు.