ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం పతాక స్థాయిలో సాగుతున్న వేళ.. వైసీపీ నేతలకు ఇంటి పోరు పెద్ద సమస్యగా మారిపోయింది. స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డే తన సొంత చెల్లెలు వైఎస్ షర్మిళ నుంచి తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటూ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. జగన్ ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లను మించి ఆయన మీద షర్మిళ ఘాటు విమర్శలు చేస్తోంది. జగన్ లొసుగులు ఒక్కొక్కటిగా బయటపెట్టి ఆయన్ని ఇరుకున పెడుతోంది.
చిన్నాన్న కూతురు అయిన సునీత సైతం జగన్‌ను ఎలా టార్గెట్ చేస్తోందో తెలిసిందే. మరోవైపు ఎన్నికల ముంగిట వైసీపీ తీర్థం పుచ్చుకుని జగన్‌ను కొనియాడుతూ, పిఠాపురంలో తిష్ట వేసి పవన్ కళ్యాణ్ ఓటమి కోసం కృషి చేస్తున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తీరును ఆయన తనయురాలే తప్పుబట్టడం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు వైసీపీ అగ్ర నేతల్లో ఒకరైన అంబటి రాంబాబు మీద సొంత అల్లుడు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ.. ఆయనకు ఓటు వేయొద్దని జనాలకు పిలుపునివ్వడం హాట్ టాపిక్‌గా మారింది. అంబటి పెద్ద కూతురిని కులాంతర వివాహం చేసుకున్న డాక్టర్ గౌతమ్ ఈ రోజు.. తన మామకు వ్యతిరేకంగా ఒక వీడియో రిలీజ్ చేశారు.
తాను సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి అయిన అంబటి అల్లుడిని అని పరిచయం చేసుకుంటూ అది తన దురదృష్టం అని పేర్కొన్న గౌతమ్.. అంబటి అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు ఇంకొకరు ఉండరని.. రోజు దేవుడికి దండం పెట్టుకునేటపుడు ఇలాంటి నీచుడిని మళ్లీ తన జీవితంలోకి తీసుకురాకు అని కోరుకుంటానని ఘాటు విమర్శలే చేశారు. అంబటిలా శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తిని తాను ఇంతవరకు చూడలేదని.. ఎమ్మెల్యేగా ఎన్నిక కావడానికి అవసరమైన అర్హతలు 0.001 శాతం కూడా లేని వ్యక్తి అంబటి అని ఆయన విమర్శించారు.
అంబటి లాంటి వాళ్లకు ఓటేస్తే.. నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పే, ఎంత లేకి పని అయినా చేసి హుందాగా బతకొచ్చు అని చాటిచెప్పే.. ఏదైనా చేసి సిగ్గులేని తనాన్ని ప్రోత్సహించవచ్చు అని అనుకునేవాళ్లకు ఓటేసినట్లు అవుతుందని.. దాని వల్ల రేప్పొద్దున సమాజం కూడా ఆయన లాగే తయారవుతుందని.. కాబట్టి ప్రజలు తెలివిగా ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వీడియో చేద్దామా వద్దా అని చాలాసార్లు ఆలోచించి.. చెయ్యడం తన బాధ్యత అని భావించి ఇది చేసినట్లు గౌతమ్ తెలిపాడు.