టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చిందని.. దానిని వదులు కోవద్దని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నెల 13న ఓటు ద్వారా వైసీపీకి, జగన్‌కు కూడా ఒకేసారి ఉరేయాలని అన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని నూజివీడు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న చంద్రబాబు వైసీపీపై నిప్పులు చెరిగారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులను హరించాలని.. వారి మెడకు ఉరిబిగించాలని చూసిన జగన్‌కు ప్రజలే తమ ఓటుతో ఉరి వేయాలన్నారు.
రాష్ట్రంలో విధ్వంస పాలనను చూసి.. పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి కూడా తెలుగు వారు వస్తున్నారని.. ఇక్కడ జగన్‌ను ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారని చెప్పారు. నూజివీడులో టీడీపీని గెలిపిస్తే.. ఇక్కడ ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష అయిన జిల్లా కేంద్రంగా మారుస్తామని చెప్పారు. అంతేకాదు.. ప్రస్తుతం ఏలూరు జిల్లాగా ఉన్న నూజివీడును కృష్ణాజిల్లాలో విలీనం చేస్తామని చెప్పారు. నూజివీడు మామిడికి భౌగోళిక గుర్తింపు తెచ్చింది కూడా టీడీపీనేనని చెప్పారు. అమరావతి రాజధాని వచ్చి ఉంటే.. నూజివీడు మరింత బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగి ఉండేదని చెప్పారు.
తాము అధికారంలోకి రాగానే.. రాజధానిని పరుగులు పెట్టిస్తామన్నారు. తద్వారా నూజివీడును అభివృద్ది చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కూటమిగా ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తున్న వైసీపీ నాయకులు.. తమ ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. రాష్ట్రంలో కూటమి పార్టీల విజయం ఖాయమైందని.. కేవలం టెక్నికల్‌గా పోలింగ్ జరుగుతోందన్నారు. ప్రజలు ఇప్పటికే ఒక నిర్ణయానికివచ్చారన్నారు. 4000 రూపాయల పింఛను తాను అధికారంలోకి వచ్చిన మరుక్షణంలోనే అమలు చేస్తానని , ఇంటికే పంపిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. నూజివీడులో టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు.