ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. ఈ క్రమంలోనే ఓటమి భయంతో టిడిపి కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపద్యంలోని తాజాగా అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి కూటమి తరఫున బరిలోకి దిగుతున్న బిజెపి అభ్యర్థి సీఎం రమేష్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఘటన సంచలనం రేపుతోంది.
అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి, ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు స్వగ్రామం తడువలో సీఎం రమేష్ ప్రచారం చేస్తున్న సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రమేష్ ను ముత్యాల నాయుడు స్వగ్రామానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కొందరు కూటమి నేతలు ప్రచారం చేసేందుకు ప్రయత్నించగా వారిపై వైసిపి కార్యకర్తలు దాడి చేశారని తెలుస్తోంది.
గ్రామానికి వచ్చిన రమేష్ రె సైతం వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రమేష్ ను పోలీసులు తరలిస్తున్న వాహనాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకొని పోలీసుల సమక్షంలోని రమేష్ పై దాడికి దిగారు. ఈ ఘటనలో రమేష్ చొక్కా చినిగిపోయింది. రమేష్ కు చెందిన మూడు వాహనాలు ధ్వంసమయ్యాయని తెలుస్తోంది.