ఏపీలో పింఛన్ల పంపిణీ.. వృద్ధుల మరణాల వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినా.. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలను ఎండలో మలమలా మాడేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ నెల 1 నుంచి 3వ తేదీ మధ్య రాష్ట్రంలో నలుగురు వృద్ధులు మృతి చెందారని తెలిపారు. ఒక్క శుక్రవారమే ఇద్దరు మృతి చెందారని.. వడగాడ్పుల కారణంగా వారు మరణించారని.. అన్నారు. ఇవి మరణాలు కావని.. ప్రభుత్వం చేసిన హత్యలని నిప్పులు చెరిగారు.
“వృద్ధుల మరణాలు ప్రభుత్వం చేసిన హత్యలు. వీటికి సీఎం జగన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి బాధ్యత వహించాలి. ఈ కేసుల్లో ఏ-1 జగన్‌రెడ్డి, ఏ-2 జవహర్‌రెడ్డి“ అని చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఆయన ప్రబుత్వ ప్రధాన కార్యదర్శికి సుదీర్ఘ లేఖ రాశారు. గత ఎన్నికల్లో సచివాలయాల్లో ఇచ్చినట్టుగా ఈ నెలలో ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. ఇంటింటికీ పంపిణీ చేసేందుకు సిబ్బంది ఉన్నా.. ఉద్దేశ పూర్వకంగా.. ఒక పార్టీకి మేలు చేయాలన్న దురుద్దేశంతోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇలా వ్యవహరించారని నిప్పులు చెరిగారు.
ముఖ్యంగా టీడీపీనే ఇలా చేసిందని.. ప్రచారం చేయడం.. దీనిని ప్రజలకు వివరించడం దారుణమని చంద్రబాబు అన్నారు. ఎన్ని కల సంఘం చెప్పినట్టు.. సచివాలయాల దగ్గర ఇవ్వొచ్చని.. నడవలేని, మంచంలో ఉన్నవారికి ఇళ్ల వద్దే పంపిణీ చేయొచ్చని కానీ, అలా చేయకపోవడం వెనుక ఖచ్చితంగా దురుద్దేశం, కుట్రపూరిత కక్ష ఉన్నాయని చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో ఇలాంటి అరాచకాలను సహించేది లేదన్నారు. ఇప్పటికైనా.. వృద్ధులు, మహిళలు పడుతున్న ఆవేదనను గుర్తించి.. వారికి సవ్యమైన రీతిలో పింఛన్లు పంపిణీ చేయాలని చంద్రబాబు సూచించారు. దీనిపై తాము కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.