పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ షాక్ తగిలింది. నిన్న మొన్నటి వరకు పార్టీని వీడుతున్న నాయకులు ఎవరా అన్న ఆలోచన ఉండేది. తాజాగా ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తాజాగా తీర్పునిచ్చింది. దండె విఠల్ ఎమ్మెల్సీ ఎన్నికను ఉన్నత న్యాయస్థానం రద్దు చేసింది. ఆయనకు రూ.50 వేల జరిమానా కూడా విధించింది.
ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2021లో దండె విఠల్ ఎన్నికయ్యాడు. అయితే ఆయన ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలిచ్చారని రాజేశ్వర్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ మీద విచారణ చేపట్టిన ధర్మాసనం దండె విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విఠల్ తర్వాత స్థానంలో నిలిచిన వ్యక్తికి ఎమ్మెల్సీ పదవి కట్టబెడతారని అంటున్నారు.
కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో జన్మించిన విఠల్ మహారాష్ట్రలోని అమరావతి యూనివర్సిటీ నుండి బిటెక్ పూర్తి చేసి నాగపూర్ యూనివర్సిటీ నుండి ఎంబీఏ పూర్తి చేశాడు. దండే విఠల్ 2000లో అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీ ప్రారంభించాడు. ఆయన తరువాత స్వదేశానికి తిరిగి వచ్చి నావిట్ సాఫ్ట్వేర్ సోలుషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, తాన్వి హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలను ప్రారంభించాడు. 2014లో ఆయన సనత్ నగర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓడిపోయాడు.