సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ శ్రీరంగనీతులు మాట్లాడుతున్నాడని, నోట్లో వేలుపెట్టిన కొరకలేనంత మంచోడని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇటువంటి మంచోడు మనకు అవసరమా? ఇంత మంచోళ్ళు ఇంట్లో ఉండాలి అంటూ చురకలంటించారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూశానని, కానీ జగన్ వంటి వ్యక్తిని మాత్రం ఎప్పుడూ చూడలేదని, ఆయన వ్యవహార శైలి సైకోలా ఉంటుంది కాబట్టే ముద్దుగా ఆయనను సైకో అని పిలుస్తున్నానని సెటైర్లు వేశారు.
జగన్ ఓ అహంకారి అని, ఆయన తీరు ఒక సైకో లాగా ఉంటుంది అని వివరించారు. జగన్ ను భరించలేక అతడిని వైఎస్ బెంగళూరు పంపించేశాడని వెల్లడించారు. చెల్లెలికి ఆస్తిలో వాటా ఇవ్వనివాడు, కన్నతల్లికి తిండి పెట్టని వాడు నీకు నాకు ఏమైనా చేస్తాడా? అని కడపలో జరిగిన ప్రజాగళ: సందర్భంగా ప్రజలను ప్రశ్నించారు. గౌరవం తెలియని వ్యక్తి, సంస్కారం నేర్చుకోని వ్యక్తి… ముఖ్యంగా విధ్వంసకారుడు జగన్ అని విమర్శించారు.
ఇలాంటివాడు ఒక ఇంట్లో ఉంటే ఇబ్బంది లేదు, కానీ ఒక ఊర్లో ఉంటే ఆ ఊరు నాశనం అవుతుంది, ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రం అతలాకుతలం అవుతుందని చంద్రబాబు మండిపడ్డారు. ‘‘జగన్ ఓ దోపిడీదారుడు, ఒక బందిపోటు. మొత్తం సంపద అంతా ఇతడికే కావాలి. ఇంత బరితెగించిన వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. ఇసుక మొత్తం దోచేశాడు. ఇతడు నాటకాల్లో దిట్ట. మోసాల్లో చాలా తెలివైనవాడు. నేరాలు ఘోరాలు చేయడంలో పీహెచ్ డీ చేశాడు… అభివృద్ధి చేయడంలో జీరో’’ అని ఎద్దేవా చేశారు.