ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సమరానికి సరిగ్గా ఇంకో రెండు వారాలే సమయం ఉంది. ఈ సమయంలో తనకు బద్ధ శత్రువులు.. ప్రధాన ప్రతిపక్ష నేతలైన టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లతో పోరాడుతూనే.. మరోవైపు తన సొంత సోదరి వైఎస్ షర్మిళతోనూ యుద్ధం చేయాల్సి వస్తోంది ఏపీ సీఎం వైఎస్ జగన్. ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి రోజు రోజుకూ తన అన్న మీద విమర్శనాస్త్రాల పదును పెంచుతూ పోతోంది షర్మిల. తాజాగా సీబీఐలో తమ తండ్రి వైఎస్ పేరు చేర్పించింది జగనే అన్న విషయాన్ని ఆమె వెల్లడించింది.
ఇదే సమయంలో జగన్ ఒక నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో షర్మిళ మీద విమర్శలు గుప్పించాడు. చంద్రబాబు చెప్పినట్లే ఆమె నడుచుకుంటోందని ఆరోపిస్తూ.. తన సోదరికి కడప పార్లమెంట్ ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదని ఆయన జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలపై షర్మిళ.. జగన్‌కు గట్టి కౌంటరే ఇచ్చింది. తనను చంద్రబాబు రిమోట్ కంట్రోల్లా ఆడిస్తున్నారని జగన్ అంటున్నారని.. కానీ జగన్ ఎవరి రిమోట్ కంట్రోల్లో పని చేస్తాడన్నది అందరికీ తెలుసని షర్మిళ ఎద్దేవా చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చెప్పినట్లు జగన్ నడుచుకుంటాడని.. ఈయన రిమోట్ కంట్రోల్ మోదీ చేతుల్లో ఉందని షర్మిళ వ్యాఖ్యానించింది.
అంతే కాక జగన్‌కు తన ఇంట్లో కూడా ఒక రిమోట్ కంట్రోల్ ఉందని.. ఆ రిమోట్ కంట్రోల్ ప్రకారమే నడుచుకుంటాడని షర్మిళ పేర్కొంది. బీజేపీ పార్టీతో పాటు జగన్‌ను ఆడించే రిమోట్ కంట్రోల్ పేరు కూడా ‘బీ’తోనే మొదలవుతుందంటూ పరోక్షంగా జగన్ భార్య భారతి మీద కౌంటర్ వేసింది షర్మిళ. ఈ పంచ్‌లు వేసేటపుడు షర్మిళ పసుపు చీర కట్టుకోవడం విశేషం. గతంలో తన కొడుకు పెళ్లికి పిలిచేందుకు పసుపు చీరతో వెళ్లి చంద్రబాబును కలవడం మీద ఇటీవల జగన్ కౌంటర్ వేయగా.. పసుపు మీద టీడీపీకి ఏమైనా పేటెంట్ ఉందా అంటూ ఎదురు దాడి చేసిన షర్మిళ.. ఇప్పుడు ఆయన్ని ఉడికించడానికి మరోసారి పసుపు చీరే కట్టుకుని మాట్లాడ్డం గమనార్హం.