ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో పాటు సీఎం రేవంత్ రెడ్డిపై ఏపీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇద్దరు నేతలను నడిపిస్తుంది టీడీపీ అధినేత చంద్రబాబు అని, వారి రిమోట్ ఆయన దగ్గరే ఉందంటూ ఓ జాతీయ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కడప లోక్ సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేయడంపై తనకు ఎలాంటి బాధా లేదని, కానీ ఆమెకు డిపాజిట్ కూడా రాదేమోనని మాత్రం బాధగా ఉందని జగన్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా తన అన్న జగన్ వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు.
ప్రధాని మోడీతో పాటు ఇంట్లో మరొకరికి జగన్ రిమోట్ కంట్రోల్ గా వ్యవహరిస్తున్నారని షర్మిల షాకింగ్ కామెంట్లు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి అన్నిచోట్లా మద్దతు తెలుపుతున్నారని షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ను రెండు రిమోట్ కంట్రోల్ లు నియంత్రిస్తున్నాయని, కేంద్రంలో బిజెపి, ఇంట్లో ఇంకో బి జగన్ కు రిమోట్ కంట్రోల్ లా ఉన్నాయని పరోక్షంగా మోడీ, భారతీ లనుద్దేశించి షర్మిల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
వాళ్ళ సూచనలను, సలహాలను, కట్టడిని జగన్ తప్పకుండా పాటిస్తారని షర్మిల ఎద్దేవా చేశారు. మోడీ చేతిలో రిమోట్ గా మారిన జగన్ ఢిల్లీలో ఆయన స్విచ్ వేయగానే ఏపీలో మద్దతు తెలిపారని చురకలంటించారు. సాక్షాత్తు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని వెల్లడించారని గుర్తు చేశారు. మోడీకి జగన్ దత్తపుత్రుడిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మణిపూర్ లో క్రిస్టియన్లపై జరుగుతున్న అరాచకాలకు క్రిస్టియన్ అయిన జగన్ మద్దతు తెలిపారని మండిపడ్డారు.
పార్లమెంటులో మణిపూర్ అంశంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఎన్డీఏ ప్రభుత్వానికి జగన్ మద్దతు ఇచ్చిన విషయాన్ని షర్మిల గుర్తు చేశారు. వైఎస్ఆర్ తీవ్రంగా వ్యతిరేకించిన మతతత్వ పార్టీ బీజేపీతో జగన్ అంట కాగడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. జగన్ వైఎస్ వారసుడా లేక మోడీ వారసుడా అంటూ అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు.