“సైకిల్‌కు ఓటేస్తే.. ఒక్కరూ మిగలరు“- అంటూ.. వైసీపీ అభ్యర్థి మెత్తగానే గట్టి హెచ్చరిక చేశారు. ఎన్నిక ల ప్రచారంలో భాగంగా.. నాయకులు ప్రజల వద్దకు వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ క్రమంలో ప్రజలను మచ్చిక చేసుకోవడం.. ఓట్లు కోరడం.. తాము చెబుతున్న విషయాలు అర్ధం చేసుకోవాలని కోర డం తెలిసిందే. ఇంత వరకు ఎవరైనా నాయకులు చేసే పనే. కానీ, చిత్రంగా వైసీపీ కీలక నాయకుడు.. నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాజాగా నియోజకవర్గంలోని శనగానపల్లి మండలంలోని మూలపల్లిగ్రామంలో మేకపాటి ఎన్నికల ప్రచా రం చేశారు. ఎన్నికల ప్రచార రథంపై నుంచి ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలు అందాలంటే.. వైసీపీ ప్రబుత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. జగన్ వస్తేనే పథకాలు కొనసాగుతాయని చెప్పారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ.. అనూహ్యంగా ఆయన టంగ్ మార్చేశారు. ఇక్కడి ఓటర్లు.. ఫ్యాను గుర్తుకే ఓటు వేయాలని చెప్పిన ఆయన పొరపాటున కూడా సైకిల్ గుర్తుకు ఓటేయొద్దన్నారు.
ఎవరైనా కాదూ.. కూడదని.. సైకిల్ గుర్తుకు ఓటేస్తే.. ఒక్కరు కూడా మిగలరని మెత్తగానే హెచ్చరించారు. ఇలాంటి పరిస్థతి తెచ్చుకోవద్దని కూడా.. ఆయన గ్రామస్తులను కోరారు. “నేను మళ్లీ మళ్లీ చెబుతున్నా.. ఇక్కడ వైసీపీ కే ఓటేయాలి. ఏ మాత్రం పొరపాటున కూడా.. ఒక్క ఓటు టీడీపీకి.. సైకిల్ గుర్తుకు పడడానికి వీల్లేదు. అలా వేశారో.. జాగ్రత్త. గట్టిగానే చెబుతున్నా.. ఒక్కరు కూడా మిగలరు. సైకిల్ గుర్తులు మనుషులు ఎవరూ ఉండరు“ అని మేకపాటి రాజగోపాల్ రెడ్డి హెచ్చరించారు.
కానీ, ఈ నియోజకవర్గంలోని మూలపల్లి గ్రామంలో ఎస్సీ,ఎస్టీలు ఎక్కువగా ఉన్నారు. అంతేకాదు.. వారు వ్యవసాయ పనులు చేస్తుంటారు. కానీ, ఇటీవల టీడీపీకి ఇక్కడ హవా పెరిగింది. తాజాగా సోమవారం 500 మంది టీడీపీలో చేరారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మేకపాటి బెదిరించారని టీడీపీ నేతలు చెబుతున్నారు.