‘ముకుంద’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన పూజా హెగ్డే.. ఆ తర్వాత హీరో నాగచైతన్యతో ‘ఒక లైలా కోసం’ అనే మరో మిడ్ రేంజ్ మూవీ చేసింది. ఈ రెండు చిత్రాలూ సరిగా ఆడకపోగా.. అదే టైంలో ఆమె టాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకుని ‘మొహెంజదారో’ కోసం బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. రెండేళ్లకు పైగా మళ్లీ ఇటు వైపు చూడలేదు.
వరుసగా రెండు ఫ్లాపులు, పైగా మధ్యలో బ్రేక్ అంటే.. ఆ హీరోయిన్‌కు మళ్లీ ఇక్కడ కెరీర్ దాదాపుగా ఉండదు. కానీ పూజా మాత్రం ‘దువ్వాడ జగన్నాథం’ లాంటి పెద్ద సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా కూడా సక్సెస్ కాకపోయినా ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. చూస్తుండగానే టాప్ హీరోయిన్ అయిపోయింది. ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ లాంటి టాప్ స్టార్లతో సినిమాలు చేసింది.
కానీ, కొన్నేళ్లుగా పూజాకు టాలీవుడ్లో మళ్లీ కలిసి రావడం లేదు. వరుస ఫ్లాపుల నేపథ్యంలో అవకాశాలు తగ్గిపోయాయి. పెద్ద హీరోల సరసన మళ్లీ ఛాన్సులు అందుకోవడం కష్టంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఆమె చూపు కెరీర్ తొలి నాళ్లలో మాదిరి మిడ్ రేంజ్ సినిమాల మీద పడ్డట్లు కనిపిస్తోంది. సాయిధరమ్ తేజ్‌తో ఓ సినిమా అన్నారు కానీ.. అదేమీ ఓకే అయినట్లు కనిపించడం లేదు. కాగా తెలుగులో తన రెండో హీరో నాగచైతన్యతో పూజా మళ్లీ జత కట్టబోతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ‘తండేల్’లో నటిస్తున్న చైతూ.. తర్వాత ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండుతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఎస్వీసీసీ బ్యానర్ మీద సీనియర్ నిర్మాత భోగవల్లి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఇందులో చైతూ సరసన పూజా దాదాపు ఫిక్స్ అయినట్లే అంటున్నారు. అంటే పదేళ్ల తర్వాత మళ్లీ ఈ జోడీని చూడబోతున్నామన్నమాట.